World Environmental Health Day 2023: మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం నివసించే ప్రదేశం, మనం తినే ఆహారం, మనం నివసించే పరిసరాలు మరియు మనం పీల్చే గాలి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మనం మన జీవన నాణ్యతను మెరుగుపరిచే ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం చాలా ముఖ్యం. పర్యావరణ ఆరోగ్యంపైనే ప్రజారోగ్యం ఆధారపడి ఉంటుంది.
ప్రపంచ మరణాలలో 24 శాతం, ప్రతి సంవత్సరం 13.7 మిలియన్ల మరణాలు పర్యావరణ కారకాల వల్ల సంభవిస్తున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పర్యావరణ సమస్యలతో లక్షలాది మంది అనారోగ్యంతో సతమతమవుతూ జీవిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోకపోతే భూగోళం జీవనానికి ప్రతికూలమైన గ్రహంగా మారుతుంది.
ప్రతి సంవత్సరం, మానవులకు, పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధంపై అవగాహన పెంచుకోవాడానికి ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని సెప్టెంబర్ 26 న జరుపుకుంటారు.
చరిత్ర:
మానవులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు అంతర్జాతీయ పర్యావరణ ఆరోగ్య సమాఖ్య (IFEH) గత మూడు దశాబ్దాలుగా కృషి చేస్తోంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్, 2011లో, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న జరుపుకోవాలని ప్రకటించింది. ఆ రోజు పర్యావరణ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలని సూచించింది.
పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడండి..
ప్రజలందరూ పర్యావరణ ఆరోగ్యానికి రక్షకులుగా ఉండాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి.
అంతేకాకుండా వారు స్వయంగా పర్యావరణ ఆరోగ్యాన్ని పాటించాలి.
ప్రభుత్వాలు కింది విధానాలను అమలు చేయాలి
- భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలి.
- ఆరోగ్యకరమైన సేంద్రియ ఆహార ఉత్పత్తులపై సబ్సిడీ ఇవ్వాలి.
- పొగాకు, స్మోకింగ్ నూ పూర్తిగా నిషేధించాలి.
- ఆహార వృథాను అరికట్టాలి.
- ఎక్కువ శాతం ఉప్పు, చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాలపై
అధిక మొత్తంలో పన్నులు విధించాలి.
- నగరాల్లో పచ్చని ప్రదేశాలు, ఉద్యానవనాలు, వినోద ప్రదేశాలు, నడక, సైకిల్ మార్గాలను పెంచాలి.
- వ్యర్థాలు, ప్లాస్టిక్‌లను తగ్గించండి.
- పునరుత్పాదక శక్తి, హైడ్రోజన్ ఇంధనానికి సబ్సిడీ ఇవ్వాలి.
- శిలాజ ఇంధన సబ్సిడీలను నిలిపివేయాలి.
- గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించాలి.
- గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించాలి.
మనమేం చేయాలి..
- ఆఫీసులకు, ఇతర ప్రయాణాలకు బైక్, లేదా కారుకు బదులుగా ప్రజా రవాణా అంటే బస్సులు, రైళ్లను ఆశ్రయించండి.
- వీలైంత తక్కువగా వ్యక్తిగత వాహనాలను ఉపయోగించండి.
- చిన్నచిన్న పనుల కోసం వీలైనంత తరచుగా నడవండి.. లేదా సైకిల్ తొక్కండి.
- ఎలక్ట్రిక్, లేదా సీఎన్జీ వాహనాలకు మారండి.
- మీ గదులను 21.5C కంటే ఎక్కువ చల్లదనంగా ఉంచొద్దు. మితిమీరిన ఏసీ వినియోగం కూడా వాతావరణానికి
హానికరం. - గదిలో లేనప్పుడు లైట్లు, హీటర్, ఎయిర్ కండీషనర్ ఆఫ్ చేయండి.
- అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలు. పానీయాలకు దూరంగా ఉండండి..
- స్థానిక ఉత్పత్తిదారుల నుంచి తాజా కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయండి.
- శాఖాహార ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి .
- పొగాకు వినియోగాన్ని నిలిపివేయండి.
- తక్కువ ప్లాస్టిక్ కొనుగోలు.. పునర్వినియోగపరచదగిన కిరాణ సంచులను ఉపయోగించండి.
మానవ కార్యకలాపాల కారణంగా గ్రీన్‌హౌస్ వాయువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్.. కారణంగా
ఏర్పడే వాతావరణ మార్పుల వల్ల మరిన్ని కరువులు, వడగాలులు, వరదలు, తీవ్రమైన తుఫానులు సంభవిస్తున్నాయి.
2100 నాటికి సముద్ర మట్టం 1-8 అడుగుల మేర పెరిగి మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. నీటిని మితిమీరి
వాడుకోవడం, భూగర్భ జలాలను ఎక్కువగా వెలికితీయడం వల్ల నీటి కొరత ఏర్పడి ‘నీటి యుద్ధాలు’ ఏర్పడతాయి.
ప్రపంచ ఉద్గారాలు 2025 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. దీని వల్ల విపత్తులను నివారించడానికి శిలాజ ఇంధనాల
వినియోగాన్ని తగ్గించాలి. పునరుత్పాదక శక్తి, హైడ్రోజన్ వంటి ఇంధనాల వినియోగాన్ని పెంచాలి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.