Greaves Electric Mobility తన అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల(EV) ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులోని రాణిపేటలో ప్రారంభించింది. ఈ పరిశ్రమ చుట్టూ ఉన్న పచ్చని భూభాగాన్ని సంరక్షించడానికి నిర్మించిన కొత్త 35 ఎకరాల ప్లాంట్ తమిళనాడులోని పారిశ్రామిక కేంద్రంలో ఉందని కంపెనీ పేర్కొంది. భారతీయ మార్కెట్‌తోపాటు విదేశీ మార్కెట్‌లకు ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్‌గా ఉపయోగపడుతుందని తెలిపింది. భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన వాటాను విస్తరించేందుకు సుమారు రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టింది. రాణిపేట ప్లాంట్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1,20,000 యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సమీప భవిష్యత్తులో 1 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది. మరో విశేషమేమంటే ఈ పరిశ్రమ 70% మహిళలతో పని చేస్తుంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు Greaves Electric Mobility సంస్థ పేర్కొంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో ప్రస్తుతం 7,000కు పైగా టచ్‌పాయింట్లు, 12,000 అసోసియేట్ మెకానిక్‌లు, వినియోగదారులను సులభతరం చేయడానికి డెడికేటెడ్ ఆన్-కాల్ సపోర్ట్ టీమ్ ఉన్నాయి. ఇంకా, అక్టోబర్ 2021 నెలలో, కంపెనీ 7,500 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది.
ఈ సందర్భంగా గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ ఎం.డి, గ్రూప్ సీఈవో నగేష్ ఎ బసవనహళ్లి మాట్లాడుతూ.. తమ బ్రాండ్.. లాస్ట్ మైల్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను డీకార్బనైజ్ చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రయాణికుల కోసం సరసమైన, నమ్మదగిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను నిర్మించడంపై దృష్టి సారించిందని అన్నారు. భవిష్యత్తులో సంవత్సరానికి మిలియన్ EVలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ విస్తరిస్తుందని తెలిపారు. లాస్ట్ మైల్ మొబిలిటీ మార్కెట్‌లో కస్టమర్‌లు, ఫ్లీట్ కొనుగోలుదారుల నుంచి పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి ఈ EV మెగా-సైట్ కంపెనీకి సహాయపడుతుందని పేర్కొన్నారు. అలాగే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో 70% మహిళలతో సహా స్థానిక కమ్యూనిటీకి అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని పెంపొందించడానికి ఉపాధిని సృష్టించేందుకు కూడా ఈ కొత్త ప్లాంట్ ఉపయోగపడుతుందని తెలిపారు.