ORR Cycle Track | హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ పై ఇపుడు సైకిళ్ల చక్కర్లతో కళకళలాడుతోంది. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణనను దృష్టిలోపెట్టుకొని నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గత బీఆర్ ఎస్ ప్రభుత్వం గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించింది. అలాగే ప్రత్యేక చొరవతో సైకిల్ ట్రాక్ పై సోలార్ కరెంట్ ఉత్పత్తి చేయడంతో పాటు దాని వెలుతురులో హాయిగా సైక్లింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే సొంత సైకిళ్లు ఉన్న వారు నేరుగా ఈ ట్రాక్‌పై సైక్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక సైకిల్ లేని వారు కూడా సైకిల్ ను అద్దెకు తీసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
ORR Cycle Track ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ పై మొదటి సైకిల్ స్టేషన్‌ను నార్సింగి హబ్‌లో ఏర్పాటు చేసి సుమారు 200 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. అందులో 40కి పైగా ఎలక్ట్రిక్ సైకిళ్లు సైతం ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కిరాయికి ఇచ్చే సైకిల్‌కు గంటలకు రూ.50 చొప్పున రుసుము వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో సైకిల్ స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. 24కి.మీ ఓఆర్‌ఆర్ సైకిల్ ట్రాక్‌పై 4 చోట్ల సైకిల్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు.
సైకిల్ స్టేషన్లు ఇక్కడే..
- తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్,
- నానక్‌రాంగూడ,
- నార్సింగి,
- కొల్లూరు
కాగా సైకిల్ స్టేషన్ల కోసం ఎంపిక చేసి అక్కడ అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నార్సింగి హబ్‌లో సైకిళ్లు అద్దెకు అందుబాటులో ఉండగా, త్వరలోనే మిగతా ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.