
- ‘ముఖ్య మంత్రి బలిరాజ షెట్-పనంద్ రాస్తే యోజన’కు మంత్రివర్గం ఆమోదం..
- వర్షాకాలంలో ఇబ్బందులు తొలగించడమే లక్ష్యం
ముంబై, డిసెంబర్ 8: మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల రైతులకు ఉపశమనం కల్పించే దిశగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ముఖ్య మంత్రి బలిరాజ షెట్-పనంద్ రాస్తే యోజన’కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద వ్యవసాయ పొలాలను అనుసంధానిస్తూ అన్ని వాతావరణాలకు అనువైన (All-weather) మోటారు అప్రోచ్ రోడ్లను నిర్మించనున్నారు.
ముఖ్యమంత్రి బలిరాజ షెట్-పనంద్ రాస్తే యోజన
ఈ పథకం ద్వారా మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల నుంచి పొలానికి మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నారు. రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే మాట్లాడుతూ, వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్ల కారణంగా రైతులు పంటల విత్తనాలు, కోతలు, రవాణాలో నిరంతర సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఈ పథకం ఆ సమస్యను పరిష్కరిస్తుందని అన్నారు.
ఈ పథకంలో అత్యంత ముఖ్యమైన అంశం 100 శాతం యాంత్రిక నిర్మాణానికి (100% mechanical construction) అనుమతించడం. గతంలో MGNREGA ఫ్రేమ్‌వర్క్ కింద మాన్యువల్ శ్రమపై ఆధారపడటం వల్ల రోడ్ల నిర్మాణ అమలు మందగించింది. ఈ కొత్త విధానం శ్రమ లభ్యతపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
నాణ్యత, వేగం: వేగవంతమైన మరియు నాణ్యమైన నిర్మాణాన్ని నిర్ధారించడానికి 100 శాతం యంత్రాలను ఉపయోగించుకునేలా ఈ పథకం అందిస్తుంది.
రైతులకు రాయితీలు, ఇతర ముఖ్యాంశాలు : రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి, రైతులకు భారం తగ్గించడానికి ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించింది: సర్వే ఫీజులు, కొలత ఛార్జీలు, పోలీసు బందోబస్త్ ఖర్చులను మినహాయించారు. రోడ్డు పనులకు అవసరమైన మట్టి, ఇసుక, మురం, కంకరపై రాయల్టీ మినహాయింపు ఇవ్వబడింది.
పర్యావరణం: రోడ్డుకు ఇరువైపులా చెట్ల పెంపకాన్ని తప్పనిసరి చేస్తుంది. నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి 25-కి.మీ ప్యాకేజీలలో క్లస్టర్ ఆధారిత టెండరింగ్‌ను ప్రవేశపెడుతుంది. ఈ పథకాన్ని మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు. రెవెన్యూ మంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ దీనిని పర్యవేక్షిస్తుంది.

