PM Surya Ghar Muft Bijli Yojana | న్యూఢిల్లీ: పెరుగుతున్న కరెంట్ బిల్లులతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజన’ ఒక వరంగా మారింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 7.7 లక్షల గృహాల విద్యుత్ బిల్లులు సున్నాకి (Zero Bill) పడిపోయాయి. మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు భారతదేశాన్ని నడిపించడంలో ఈ పథకం గేమ్-ఛేంజర్‌గా మారుతోంది.
ఏమిటి ఈ పథకం?
ఫిబ్రవరి 2024లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక పథకం (PM Surya Ghar Muft Bijli Yojana) ద్వారా రూ. 75,000 కోట్లకు పైగా నిధులతో 2026 నాటికి ఒక కోటి ఇళ్లపై సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి.
పథకం ద్వారా కలిగే ప్రధాన ప్రయోజనాలు:
40% వరకు సబ్సిడీ: సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాల్ చేసుకునే కుటుంబాలకు వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి నేరుగా సబ్సిడీ అందుతుంది.
నెట్ మీటరింగ్ సౌకర్యం: గృహ అవసరాలకు పోను మిగిలిన అదనపు విద్యుత్తును తిరిగి గ్రిడ్‌కు పంపడం ద్వారా క్రెడిట్స్ లేదా డబ్బులు పొందవచ్చు.
పర్యావరణ హితం: కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన భద్రతను పెంచుతుంది.
అర్హతలు ఏమిటి?
- ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి క్రింది అర్హతలు ఉండాలి:
- భారతీయ పౌరుడై ఉండాలి.
- సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు తగిన స్థలం ఉన్న సొంత ఇల్లు ఉండాలి.
- యాక్టివ్ విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండాలి.
- ఇంతకు ముందు ఏ ఇతర సోలార్ సబ్సిడీ పొంది ఉండకూడదు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం (Step-by-Step):
రిజిస్ట్రేషన్: ముందుగా అధికారిక PM Surya Ghar పోర్టల్‌ను సందర్శించి మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి.
వివరాల నమోదు: మీ రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ (DISCOM)ను ఎంచుకుని, వినియోగదారు నంబర్ (Consumer Number) ఎంటర్ చేయండి.
అప్రూవల్: రూఫ్‌టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేయండి. సాంకేతిక సాధ్యాసాధ్యాల (Technical Feasibility) ఆమోదం కోసం వేచి ఉండండి.
ఇన్‌స్టాలేషన్: ప్రభుత్వం గుర్తించిన (Empaneled) వెండర్ ద్వారా సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయించుకోండి.
నెట్ మీటరింగ్: ఇన్‌స్టాలేషన్ పూర్తయ్యాక నెట్ మీటరింగ్ కోసం దరఖాస్తు చేసి, సర్టిఫికేట్ పొందండి.
సబ్సిడీ: మీ బ్యాంక్ వివరాలను సమర్పిస్తే, సబ్సిడీ మొత్తం నేరుగా మీ ఖాతాలో జమ చేయబడుతుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..



