చెన్నై: పునరుత్పాదక శక్తి రంగంలో తమిళనాడు ప్రభుత్వం (TamilNadu) మరో ముందడుగు వేసింది.తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (TNGEC) ప్రతిపాదించిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో కూడిన 64.75 మెగావాట్ల గ్రిడ్-కనెక్ట్ సౌర–విండ్ విద్యుత్ ప్రాజెక్టుకు తమిళనాడు విద్యుత్ నియంత్రణ కమిషన్ (TNERC) ఆమోదం తెలిపింది.
ప్రాజెక్టు వివరాలు
ఈ ప్రాజెక్టును కరూర్, తిరువారూర్ (తలా 15 మెగావాట్లు) జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన సామర్థ్యాన్ని తూత్తుకుడి, మధురై, కన్యాకుమారి జిల్లాల్లో హైబ్రిడ్ ప్లాంట్ల రూపంలో అభివృద్ధి చేస్తారు.
ప్రాజెక్టు కాంట్రాక్ట్ వ్యవధి 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ ద్వారా డెవలపర్‌ను ఎంపిక చేస్తారు.
కరూర్ జిల్లా కలెక్టర్ ఎం. తంగవేల్ 2022 ఆగస్టు 18న కె. పిచ్చంపట్టి గ్రామంలోని 53.72 ఎకరాల ప్రభుత్వ భూమి వినియోగానికి అనుమతి ఇచ్చారు. తిరువారూర్ కలెక్టర్ వి. మోహనచంద్రన్ 2022 ఏప్రిల్ 26న కొరుక్కై గ్రామంలోని 49.9 ఎకరాల పుంజాయి తరిసు భూమి వినియోగానికి అనుమతి ఇచ్చారు. ఇక్కడ మొత్తం 30 మెగావాట్ల సామర్థ్యం గల రెండు సౌర ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మిగిలిన జిల్లాల్లో కూడా తగిన భూములు గుర్తించబడ్డాయని వివరించారు.



