Toyota Urban Cruiser EV | భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా పెరుగుతున్న వేళ, ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV, ‘అర్బన్ క్రూయిజర్ EV ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. రేపు, అంటే జనవరి 20, 2026న ఈ కారు అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. లాంచ్‌కు ముందే కంపెనీ విడుదల చేసిన టీజర్ వాహన ప్రియుల్లో భారీ అంచనాలను పెంచింది.
Urban Cruiser EV : డిజైన్
టయోటా ఇండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా విడుదల చేసిన టీజర్‌లో అర్బన్ క్రూయిజర్ EV యొక్క ఆధునిక డిజైన్ ఎలిమెంట్లు కనిపిస్తున్నాయి. ఏరో-ఎఫిషియన్సీకి అనుగుణంగా రూపుదిద్దుకున్న బాడీ షేప్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, సింగిల్-స్ట్రిప్ LED DRLతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ ఈ SUVకి ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. మారుతి సుజుకి ఇ-విటారా ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రిక్ వాహనం, క్యామ్రీ ప్రేరణతో రూపొందించిన బ్లాక్ ట్రిమ్ LED యూనిట్ల ద్వారా టయోటా సిగ్నేచర్ డిజైన్‌ను ప్రతిబింబిస్తోంది.
ఇంటీరియర్ & టెక్నాలజీ:
క్యాబిన్ లోపల లగ్జరీ మరియు టెక్నాలజీ కలబోతగా ఉంటుంది. సాఫ్ట్-టచ్ సర్ఫేస్‌లు, లెథరెట్ అప్హోల్స్టరీతో పాటు 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిపే డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉండనుందని అంచనా. వైర్‌లెస్ ఛార్జింగ్, పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు రోజువారీ వినియోగానికి అనువైన సౌలభ్యాన్ని అందించనున్నాయి. ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్ క్యాబిన్‌ను మరింత విశాలంగా అనిపించేలా చేస్తాయి.
భద్రతలో టాప్ క్లాస్:
ఈ ఎలక్ట్రిక్ SUV మారుతి సుజుకి ఇ-విటారాతో HEARTECT-e ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటోంది. కొలతల పరంగా ఇది సుమారు 4,285 మిల్లీమీటర్ల పొడవు, 1,800 మిల్లీమీటర్ల వెడల్పు, 1,640 మిల్లీమీటర్ల ఎత్తు, 2,700 మిల్లీమీటర్ల వీల్‌బేస్‌ను కలిగి ఉండనుంది. ఈ పరిమాణాలు పట్టణ మరియు హైవే ప్రయాణాలకు అనుకూలమైన బ్యాలెన్స్‌ను అందిస్తాయని అంచనా.
భద్రత విషయంలో టయోటా తన సంప్రదాయాన్ని కొనసాగించనుంది. అర్బన్ క్రూయిజర్ EVలో ఏడు ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS వంటి ఆధునిక డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు TPMS, ESC, EBDతో కూడిన ABS వంటి కీలక భద్రతా వ్యవస్థలు స్టాండర్డ్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే 5-స్టార్ BNCAP రేటింగ్ పొందిన మారుతి ఇ-విటారా ఆధారంగా రూపొందించబడటంతో, ఈ EV కూడా ఉన్నత భద్రతా ప్రమాణాలను సాధించే అవకాశం ఉంది.
బ్యాటరీ/ పవర్‌ట్రెయిన్ (రేంజ్):
బ్యాటరీ, రేంజ్ పరంగా అర్బన్ క్రూయిజర్ EV రెండు ఆప్షన్లతో రానుందని అంచనా. 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉండగా, పెద్ద బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 543 కిలోమీటర్ల వరకు రేంజ్ లభించే అవకాశం ఉంది. ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 144 hp మరియు 174 hp పవర్ అవుట్‌పుట్ ఆప్షన్లు అందించనున్నారు. ఇది నగర వినియోగంతో పాటు దీర్ఘ ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉండనుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..





