Telangana : సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో ఏర్పడిన సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి కేంద్ర ప్రభుత్వ దృష్టికి లేఖల ద్వారా తీసుకెళ్లారు. మంత్రి తుమ్మల పేర్కొన్న ప్రకారం, మోంథా తుఫాను, అకాల వర్షాలు, అనిశ్చిత వాతావరణం కారణంగా పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నిబంధనలలో ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మంత్రి తుమ్మల ప్రకారం రాష్ట్రంలో 3.66 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు జరిగిందని, ఎకరాకు సగటు 7.62 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశారు. కానీ అకాల వర్షాల ప్రభావంతో గింజల నాణ్యత తగ్గి, FAQ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో రైతులు (Telangana Farmers ) ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో NAFED, NCCF సంస్థలు సడలించిన నాణ్యత ప్రమాణాలకనుగుణంగా కొనుగోళ్లు జరపాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.
మొక్కజొన్న రైతులకు MSP కింద రక్షణ చర్యలు
ప్రస్తుతం 6.74 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగుతుందని, 16.85 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని మంత్రి తుమ్మల వివరించారు. మార్కెట్ ధర క్వింటాల్‌కు ₹1959కు పడిపోయి, కేంద్రం ప్రకటించిన MSP ₹2400 చేరకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 48,757 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 14,519 మంది రైతులకు ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు.
ఇకపై MSP కింద మొత్తం ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు NAFED, NCCF సంస్థలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
పత్తి రైతులకు ఎకరాకు పరిమితి తొలగించాలి.
సీసీఐ ప్రతిపాదించిన ఎకరాకు 7 క్వింటాళ్ల పరిమితి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. మోంథా తుఫాను ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నందున, తేమ శాతంలో సడలింపులు ఇవ్వాలని, అలాగే ఎకరాకు 11.74 క్వింటాళ్ల దిగుబడి ఆధారంగా కొనుగోలు కొనసాగించాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..



