న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని (Delhi Pollution) అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అత్యంత భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేఖ గుప్తా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కాలుష్య నిరోధక ‘బ్లూప్రింట్’ను ఆమోదించారు. రాబోయే 12 నెలల పాటు 24 గంటలూ పనిచేసి కాలుష్య రహిత ఢిల్లీని నిర్మించాలని అధికారులకు పిలుపునిచ్చారు.
ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు
ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు రవాణా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా పునర్నిర్మిస్తోంది:
2029 మార్చి నాటికి ప్రజా రవాణా కోసం మొత్తం 14,000 బస్సులను రోడ్లపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో మొదటి విడతగా 2026 చివరి నాటికి 6,000 బస్సులు రానున్నాయి.
మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం 500 చిన్న బస్సులు (7 మీటర్ల పొడవు) అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 395 కి.మీ. ఉన్న మెట్రో నెట్‌వర్క్‌ను 500 కి.మీ.లకు పెంచనున్నారు.
ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీ 2.0
పర్యావరణ ప్రేమికులకు, వాహనదారులకు ఈ పాలసీ పెద్ద పీట వేస్తోంది.. ఢిల్లీలోని 58 లక్షల ద్విచక్ర వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడమే లక్ష్యంగా భారీ సబ్సిడీలు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌లు ప్రకటించారు. పబ్లిక్ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ పాయింట్లను ప్రస్తుతం ఉన్న 9,000 నుండి 36,000కి పెంచనున్నారు.
దుమ్ము నివారణ, రోడ్ల మరమ్మతులు
రూ. 6,000 కోట్ల బడ్జెట్: నగరంలోని 3,300 కి.మీ. మేర దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయనున్నారు.
రోడ్డు దుమ్మును తగ్గించడానికి 76కు పైగా మెకానికల్ స్వీపింగ్ యంత్రాలను, 250 వాటర్ స్ప్రింక్లర్లను మోహరించారు. శీతాకాలంలో చెత్త దహనాన్ని అరికట్టడానికి, బయోమాస్‌కు ప్రత్యామ్నాయంగా 15,500 ఎలక్ట్రిక్ హీటర్లను పంపిణీ చేశారు.
పచ్చదనం.. వ్యర్థాల నిర్వహణ
35 లక్షల మొక్కలు: వచ్చే నాలుగేళ్లలో ఢిల్లీ రిడ్జ్ ప్రాంతంలో 35 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం 14 లక్షలు, అదనంగా 365 ఎకరాల బ్రౌన్ పార్క్ పునరాభివృద్ధి చేయనున్నారు. 2026 నాటికి ఓఖ్లా, భల్స్వా చెత్త గుట్టలను పూర్తిగా తొలగించి, ఆ ప్రాంతాలను శుభ్రం చేయనున్నారు. తుఖ్రామ్‌లోని కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్ బయోమాస్ మరియు నిర్మాణ వ్యర్థాల ధూళిని నిర్వహిస్తుంది.
పరిశ్రమలపై కఠిన చర్యలు:
కాలుష్యం కలిగిస్తున్న 1,000 పారిశ్రామిక యూనిట్లను మూసివేయడంతో పాటు, మిగిలిన వాటిలో రియల్-టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ (OCEMS) ఏర్పాటు చేస్తున్నారు.ANPR వ్యవస్థలు ప్రత్యేక ప్రచారం ద్వారా కాలుష్య వాహనాలను పర్యవేక్షిస్తాయి అలాగే జరిమానా విధిస్తాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..





