Amaravathi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ (PaddyProcurement) కార్యకలాపాలు నవంబర్ 3 నుండి ప్రారంభం కానున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రైతులు తమ వివరాలను వాట్సాప్ నంబర్ 73373 59375కు “HI” సందేశం పంపడం ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్య సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా 3,000 రైతు సేవా కేంద్రాలు, దాదాపు 2,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి మనోహర్ వివరించారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు 10,500 మందికి పైగా సిబ్బందిని నియమించామని, కొనుగోలు చేసిన 48 గంటల్లోపు రైతులకు చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
అలాగే, గన్నీ బ్యాగుల నాణ్యతను ముందుగానే పరీక్షించుకోవాలని, తేమ పరీక్ష యంత్రాలు, రవాణా సౌకర్యాలు ఆలస్యం లేకుండా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర స్థాయి సేకరణ కార్యక్రమాన్ని నవంబర్ 3న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని అరుగులను గ్రామంలో నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఖరీఫ్ సేకరణ డ్రైవ్‌కు అధికారిక ప్రారంభం కానుంది.



