Solar news | సుస్థిర ఇంధన విధానాలు, సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని సిరిపురం గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపిక చేశారు. టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ ఆర్‌ఈడీసీఓ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల వావిళ్ల, సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేందర్‌తో కలిసి గ్రామాన్ని ఇటీవల సందర్శించారు.
ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి గ్రామస్థులతో కలిసి వివరించారు. గ్రామంలో 1,039 మంది గృహ వినియోగదారులు, 520 మంది వ్యవసాయ వినియోగదారులు (రైతులు) ఉన్నారు. కాగా గృహ వినియోగదారులకు సంబంధించి సర్వే పూర్తయింది. ఇప్పటివరకు దాదాపు 50 శాతం వ్యవసాయానికి సంబంధించి విద్యత్ వినియోగంపై సర్వే చేశారు. మిగిలినవి వచ్చే మూడు రోజుల్లో పూర్తవుతాయి. పారదర్శకత, పురోగతిని ట్రాక్ చేయడానికి పీఎం-సూర్య ఘర్ పోర్టల్‌లో సేవా వివరాలు క్రమపద్ధతిలో నమోదు చేస్తున్నామని వరుణ్ రెడ్డి చెప్పారు.
ఆర్థికపరమైన సమస్యలు తలెత్తకుండా వినియోగదారులందరూ సోలర్ ను తీసుకునేలా జీరో ఖర్చుతో ఈ సోలార్ ప్రాజెక్ట్ అమలు చేయనున్నారు.వినియోగదారులు మిగులు విద్యుత్‌ను తిరిగి డిస్కామ్‌కు విక్రయించి వారు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
సోలార్ ప్యానల్ ఏర్పాటుకు పైకప్పులు లేని 201 మంది గృహ వినియోగదారుల కోసం వారి ఇళ్ల వద్ద అందుబాటులో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో ఎత్తైన నిర్మాణాలను నిర్మించే అవకాశాలను అన్వేషించాలని TGREDCO అధికారులను సీఎండీ ఆదేశించారు .
రైతులు తమ పొరుగువారితో సహకరించుకోవాలని, భాగస్వామ్య వ్యవసాయ క్షేత్రాలలో సమష్టిగా సౌర ఫలకాలను ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించగా రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. సౌరశక్తికి మారడం వల్ల భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనాన్ని స్వీకరించడం ద్వారా, వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రమాదాలను తగ్గించడంలో పాటు గ్రామీణ తెలంగాణలో స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడంలో సిరిపురం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్థులను వరుణ్ రెడ్డి కోరారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..