Urea Booking App | రైతులు ఎరువుల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే కష్టాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. యూరియా పంపిణీని మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహించేందుకు ‘ఎరువుల బుకింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గందరగోళానికి తెర:
గత ఖరీఫ్ సీజన్‌లో యూరియా కోసం రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎరువుల దుకాణాల వద్ద చెప్పులు, రాళ్లు లైన్లలో పెట్టి నిరీక్షించిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సాంకేతిక పరిష్కారాన్ని తెచ్చింది. అవసరానికి మించి కొనుగోలు చేయడం, నిల్వ చేయడం వంటి సమస్యల వల్ల ఏర్పడే కృత్రిమ కొరతను ఈ యాప్ అరికట్టనుంది.
Urea Booking App : బుకింగ్ విధానం ఇలా..
- రైతులు తమ మొబైల్ ద్వారానే సులభంగా ఎరువులను బుక్ చేసుకోవచ్చు:
- పట్టాదారు పాసుబుక్ నంబర్, భూమి విస్తీర్ణం, సాగు చేస్తున్న పంట వివరాలను యాప్‌లో నమోదు చేయాలి.
భూ విస్తీర్ణాన్ని బట్టి ఆ రైతుకు ఎంత యూరియా అవసరమో యాప్ నిర్ణయిస్తుంది. - ఒకసారి బుకింగ్ పూర్తయ్యాక, 24 గంటల్లోగా సంబంధిత సొసైటీ లేదా డీలర్ వద్ద నుండి ఎరువులను తీసుకోవాల్సి ఉంటుంది.
గ్రామాల్లో అవగాహన సదస్సులు:
రైతులకు ఈ యాప్‌పై పూర్తి అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతు వేదికలు, పంచాయతీ భవనాలు, గ్రామ కూడళ్లలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. యూరియా పక్కదారి పట్టకుండా, అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందేలా చూడటమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలుపుతున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..



