- పాకిస్తాన్, థాయిలాండ్ ఆధిపత్యానికి సవాలు
- న్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెంచేందుకు జపాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 26 దేశాలను ఎంపిక చేసింది. వీటికి గ్లోబల్ ఇండెక్స్ (GI) గుర్తింపు పొందిన బియ్యం ఎగుమతి చేయనుంది. ఈ ప్రణాళికతో ₹1.8 లక్షల కోట్ల దిగుమతులను భర్తీ చేసే అవకాశం ఉందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం పాకిస్తాన్, థాయిలాండ్ ఆధిపత్యం ఉన్న బియ్యం మార్కెట్లపై భారత ప్రభావాన్ని పెంచనుంది. దీంతో పాకిస్తాన్‌లో ఇప్పటికే ఉన్న ఆర్థిక ఒత్తిడులు మరింత తీవ్రం కానున్నాయని అంచనా వేస్తున్నారు.
ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ (BIRC 2025)
రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలో ఫిలిప్పీన్స్, ఘనా, నమీబియా, గాంబియా విదేశాంగ మంత్రులు పాల్గొననున్నారు. APEDA చైర్మన్ అభిషేక్ దేవ్ ప్రకారం, ఈ కాన్ఫరెన్స్‌లో రూ.25,000 కోట్ల విలువైన ఎగుమతి అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోనున్నారు. అదేవిధంగా, బియ్యం గ్రేడింగ్ మెరుగుపరచడానికి, వృథాను తగ్గించడానికి రూపొందించిన AI ఆధారిత యంత్రాన్ని కూడా ప్రదర్శించనున్నారు. ఇది తెల్ల బియ్యం వృథాను 25% నుంచి 10%కి తగ్గించగలదని అధికారులు తెలిపారు.
ప్రపంచ బియ్యం మార్కెట్‌లో భారత స్థానం
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారు. ఎగుమతిదారుల్లో ఒకటి. ప్రస్తుతం 172 దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తోంది. 2024–25లో ఉత్పత్తి: 150 మిలియన్ టన్నులు , పంట విస్తీర్ణం: 47 మిలియన్ హెక్టార్లు. హెక్టారుకు దిగుబడి: 2014–15లో 2.72 టన్నుల నుండి 2024–25లో 3.2 టన్నులకు పెరుగుదల నమోదు చేసుకుంది. 2024–25 ఎగుమతి విలువ సుమారు $12.95 బిలియన్లు (సుమారు ₹1.08 లక్షల కోట్లు)గా ఉంది. ఈ సమావేశంలో 3,000 మంది రైతులు, FPOలు, 80 దేశాల 1,000 మంది విదేశీ కొనుగోలుదారులు, అలాగే 2,500 ఎగుమతిదారులు, మిల్లర్లు పాల్గొననున్నారు. ఈ అంతర్జాతీయ సమావేశం ద్వారా సస్టైనబుల్ వ్యవసాయం, ఎగుమతి వృద్ధి, రైతు సంక్షేమంకు కొత్త దిశ ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.


