• హన్మకొండ పరిధిలో 10 ఎకరాల్లో నూతన పూల మార్కెట్ స్థల సేకరణకు నిర్ణయం
• లక్ష్మీపురం ఇంటిగ్రేటెడ్ మార్కెట్, గోదాముల నిర్మాణం, డ్రైనేజీ వసతులకు గ్రీన్ సిగ్నల్
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Enumamula Market) కమిటీ పాలకవర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక ఆధ్వర్యంలో మంగళవారం (ఆగస్టు 25 ) చైర్‌పర్సన్ ఛాంబర్‌లో వైస్ చైర్మన్ బండి జనార్ధన్, పాలకవర్గ సభ్యులు అధికారులతో మార్కెట్ కమిటీ ముఖ్య సమావేశం జరిగింది.
మార్కెట్ యార్డు అభివృద్ధి, రైతులు, వ్యాపారుల సౌకర్యార్థం పలు నూతన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సంబంధించి కమిటీ ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించి, ప్రతిపాదనలు రూపొందించింది.
మార్కెట్ కమిటీ సమావేశంలో తీసుకున్న ప్రధాన తీర్మానాలు:
- నూతన పండ్ల మార్కెట్ & పోలీస్ స్టేషన్: ముసలమ్మకుంట నుండి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం నేపథ్యంలో భూమి అప్పగించడంతో పాటు, నూతన పండ్ల మార్కెట్ నిర్మాణం కోసం 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు తీర్మానించారు. అలాగే ఎనుమాముల మార్కెట్ ఆవరణలో పోలీస్ స్టేషన్, పీహెచ్‌సీ (PHC) నిర్మాణం కొరకు భూమిని అప్పగించేందుకు అంగీకరించారు.
- గోదాముల నిర్మాణం: ఎనుమాముల మార్కెట్ యార్డ్‌తో పాటు పర్వతగిరి, షోడశాపల్లి సబ్‌యార్డులలో నూతన గోదాముల (Godowns) నిర్మాణానికి ప్రతిపాదనలు పంపనున్నారు.
- హన్మకొండలో పూల మార్కెట్: హన్మకొండ పరిధిలో ప్రత్యేకంగా పూల మార్కెట్ ఏర్పాటుకు 10 ఎకరాల స్థల సేకరణ జరపాలని నిర్ణయించారు. అలాగే నోటిఫైడ్ ప్రాంతంలోని ప్రతి మండలంలో కనీసం 5 ఎకరాలు తగ్గకుండా స్థల సేకరణ చేయనున్నారు.
- లక్ష్మీపురం గ్లెన్ మార్కెట్ పునరుద్ధరణ: 1993లో నిర్మించి శిధిలావస్థకు చేరిన లక్ష్మీపురం గ్లెన్ మార్కెట్ టవర్ బిల్డింగ్‌కు మరమ్మత్తులు చేసి, దానిని కూరగాయల, పండ్ల మార్కెట్ కార్యాలయంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. లక్ష్మీపురం ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఉన్నది ఉన్నట్లుగా GWMC నుండి హ్యాండోవర్ తీసుకోనున్నారు.
- వ్యాపారులకు ఊరట: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే సూచన మేరకు 158 రిటైల్ ప్లాట్ల అద్దెలను తగ్గించడం, గత అద్దెలను మాఫీ చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
- అంబేద్కర్ విగ్రహం & కమర్షియల్ షాప్‌లు: ఎనుమాముల మార్కెట్ గేట్-2 వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ‘G+1’ కమర్షియల్ షాప్‌ల నిర్మాణం చేపడతారు. అలాగే యార్డు ఆవరణలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు తీర్మానించారు.
- ఇతర అభివృద్ధి పనులు: ఎక్సైజ్ కాలనీ రైతు బజార్ ఆధునీకరణ, గొర్రెకుంట గోదాంకు రెండు వైపులా రహదారి నిర్మాణానికి స్థల సేకరణ, వర్షపు నీరు బయటకు వెళ్లేలా ఎనుమాముల, లక్ష్మీపురం మార్కెట్లలో కొత్త డ్రైనేజీల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. సెక్యూరిటీ, ఆఫీస్ అవసరాల కోసం 30 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు (DEOs), 30 మంది సెక్యూరిటీ గార్డుల నియామక ప్రతిపాదనలు పంపనున్నారు.
ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్ బండి జనార్ధన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ, ఉన్నత శ్రేణి కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు గాడరబోయిన రాజు, కందుకూరి పూర్ణచందర్, చల్లా వాసుదేవా రెడ్డి, గొడుగు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.




