హైదరాబాద్: భాగ్యనగరం గ్రీన్ సిటీగా మారే దిశగా మరో కీలక అడుగు పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించి, ప్రజా రవాణాను పర్యావరణ హితంగా మార్చేందుకు TGSRTC, TGSPDCL చేతులు కలిపాయి. నగరవ్యాప్తంగా 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో, వీటికి అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు.
25 డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లు
హైదరాబాదాద్‌లో తాజాగా జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో సదరన్ డిస్కామ్ (TGSPDCL) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 25 ప్రధాన బస్ డిపోల్లో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
వీటితో పాటు జిల్లా కేంద్రాలైన సూర్యాపేట (2 స్టేషన్లు), సంగారెడ్డి (1), మరియు నల్గొండ (1) డిపోలలో కూడా ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి.
124 మెగావాట్ల భారీ విద్యుత్ సరఫరా
ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణకు దాదాపు 124 మెగావాట్ల విద్యుత్ అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు అవసరమైన సబ్‌స్టేషన్లు, స్విచింగ్ స్టేషన్ల ఏర్పాటుకు డిపోల్లోనే స్థలాలను కేటాయించనున్నారు.
“ఈ ఏడాది చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తాం.” — వై. నాగి రెడ్డి, వైస్ చైర్మన్ & ఎండీ, TGSRTC.
ఫిబ్రవరి 1 నుంచి పనులు ప్రారంభం
ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి ఫిబ్రవరి 1 నాటికి అంచనాలు (Estimates) సిద్ధం చేసి, పనులు ప్రారంభించాలని సదరన్ డిస్కామ్ సీఎండీ Md. ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. దీనివల్ల నగరంలో డీజిల్ బస్సుల వాడకం తగ్గి, కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.





