Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగ గ్రామానికి చెందిన రైతు దంపతులు కొసిరెడ్డి లావణ్య – రమణ రెడ్డి సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి సేద్యం (Organic Farming )తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణంగా మిర్చి పంటకు వారంలో పలుమార్లు రసాయన పిచికారీ అవసరం అవుతుంది. కానీ ఈ దంపతులు ఒక్క కూడా రసాయన ఎరువులు ఉపయోగించకుండా వీరముష్టి కషాయం, అగ్ని అస్త్రం, గోమూత్రం, పశువుల ఎరువు వంటి స్వచ్ఛమైన ప్రకృతి ఆధారిత పద్ధతులతో పంటను సంరక్షించుకుంటున్నారు. ఫలితంగా, వీరి మిర్చిపంట ఎలాంటి తెగుళ్లు లేకుండా ఆరోగ్యకరంగా పెరిగి ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తోంది.
అంతేకాక, వరి పంటలో కూడా సాధారణ రకాల కంటే అధిక పోషక గుణాలు కలిగిన బాస్మతి, బ్లాక్ రైస్ వంటి ప్రత్యేక రకాలను సైతం పండిస్తున్నారు. పంటను నేరుగా వినియోగదారులకు అందించడానికి ‘లావణ్య బ్రాండ్’, ‘ప్రకృతి సేద్యం’ పేర్లతో హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని స్వంత ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేసి, తమ సేంద్రీయ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ప్రకృతి సాగుకు, నాణ్యమైన ఆర్గానిక్ ఆహారానికి నిదర్శనంగా నిలిచిన ఈ రైతు దంపతులు సుస్థిర వ్యవసాయం ఎలా ఉండాలో చూపిస్తున్నారు.


