Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Microgreens: మైక్రో గ్రీన్స్‌ ఇంట్లో ఎలా పెంచాలి? ఎలా తినాలో తెలుసుకోండి..

Spread the love

Microgreens: పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో కూరగాయల మొక్కలను పెంచునేందుకు తగినంత స్థలం ఉండదు.. ఇక కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరాల్లో మనం కనీసం పిరికెడంత మట్టి కూడా కనిపించదు.. అయితే ఇంట్లో ఆకుకూరలు పెంచుకునే అవకాశం లేనివారికి మైక్రోగ్రీన్స్ ఒక చక్కని ప్రత్యామ్నాయం.  తక్కువ స్థలంలోనే సులభంగా మైక్రోగ్రీన్స్ ను పెంచుకోవచ్చు. వీటిని ఎలా పెంచుకోవాలో.. ఎలా తినాలో ఒకసారి పరిశీలిద్దాం..

మనం ఆరోగ్య రక్షణ కోసం కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను ఎక్కువగా తింటూ ఉంటాం.. అయితే కూరగాయలు, ఆకుకూరలపై మితిమీరి పురుగు మందులు, రసాయనాలను  చల్లుతున్నారు. దీంతో ఆకు కూరల్ని వండుకునేప్పుడు చాలా మంది పురుగు మందుల వాసనను ఒక్కోసారి గ్రహిస్తూ ఉంటారు. మరి ఎలాంటి పురుగుమందులూ లేకుండా  ఆకుకూరల్ని తినేందుకు ఇంటి ఆవరణలోనే వాటిని ఈజీగా పెంచుకోవాలి. ఇంటిలో స్థలం లేని వారికి మైక్రో గ్రీన్స్‌ మంచి ప్రత్యామ్నాయంగా  చెప్పవచ్చు. ఆకుకూరలతో పోలిస్తే వీటిని పెంచడమూ చాలా తేలిక. పోషకాలు కూడా ఎక్కువే. మరి వీటిని పెంచి ఎలా ఉపయోగించుకోవచ్చో ఒకసారి తెలుసుకుందాం రండి.

మైక్రో గ్రీన్స్‌ అంటే ఏమిటీ? (What Are Microgreens? )

ఆవాలు, మెంతులు, ధనియాలు, పెసర్లు, బ్రోకలీ, బీట్‌రూట్‌, కాలే, ఎర్ర క్యాబేజీ గింజలు, ర్యాడిష్ విత్తనాలు తదితరాలను మైక్రో గ్రీన్స్‌గా పెంచుకోవచ్చు. చిన్న చిన్న కుండీల్లో కాస్త మట్టి వేసి వీటిని ఒత్తుగా చల్లుకుని ప్రతిరోజూ నీటిని స్ప్రే చేస్తూ ఉండాలి. ఆరు నుంచి పది రోజుల్లోపు చక్కగా పెరుగతాయి. ఇవి రెండు నుంచి మూడు అంగుళాల పొడవుగా ఎదిగితే ఇక కోసేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తాజాగా కూరల్లో వాడుకోవచ్చు.

మైక్రో గ్రీన్స్‌ని ఎలా ఉపయోగించుకోవాలి:

ఈ చిన్న లేత మొలకల్లాంటి ఆకుల్లో పోషకాలు పుష్కలంగా  ఉంటాయి. వాటిని ఎక్కువగా వేడి చేసి వండటం వల్ల అవి నశిస్తాయి. దీనికి బదులుగా వాటిని కూర వండుకున్నా లేదా తర్వాత చివర్లో కొత్తిమీర చల్లుకున్నట్లు చల్లి దించేసుకోండి. అప్పుడు ఎక్కువ పోషకాలు మన శరీరంలోకి చేరి మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరిస్తాయి.  అలాగే స్మూతీలలో కూడా వాడుకోవచ్చు. కాస్త వెన్నలో ఒక్క నిమిషం పాటూ వేయించి కూడా తినొచ్చు. ఇంకా సలాడ్ లలో నేరుగా వీటిని చేర్చకోవచ్చు. పీజాలు, బర్గర్లు, రోల్స్‌ వంటి వాటిలో పైన టాపింగ్‌లా పెట్టుకుని చక్కగా ఆరగించవచ్చు.

micro-greens
Image by prostooleh on Freepik

మైక్రో గ్రీన్స్‌లో పోషకాలు (microgreens benefits) :

మైక్రోగ్రీన్స్‌లో మెగ్నీషియం, మాంసనీస్, ఐరన్‌ వంటి ఖనిజపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పచ్చిగా ఎక్కువ తింటాం కాబట్టి ఈ పోషక విలువలు నశించిపోకుండా శరీరానికి అందుతాయి. అలాగే వీటిలో 40 శాతం వరకు ఫైటోకెమికల్స్‌ ఉంటాయి. మామూలు ఆకుకూరలతో పోలిస్తే వీటిలో 40రెట్లు అధికంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పవచ్చు. .
మైక్రో గ్రీన్స్‌ తినడం వల్ల లాభాలు :
వీటిని తరచూ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జ్ఞాపక శక్తి తగ్గదు.. మధుమేహం ప్రమాదం తగ్గుముఖం పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు కూడా దరిచేరవు.

గమనిక:  గర్భిణులు, చిన్నపిల్లలు వృద్ధులు వైద్యుల సలహా తీసుకుని మైక్రో్గ్రీన్స్ తినాల్సి ఉంటుంది..


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *