ఇక విద్యుత్ సంస్థలే మీకు పైసలు ఇస్తాయి: డిప్యూటీ సీఎం భట్టి
- రావినూతలలో ‘సోలార్ మోడల్ విలేజ్’ పథకాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క.
- రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాల్లో రూ. 1,380 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్.
- ప్రతి ఇంటికి ఏటా రూ. 14,000 ఆదా.. మిగులు విద్యుత్ విక్రయంతో అదనపు ఆదాయం.
- వ్యవసాయ పంపుసెట్లపై కూడా సోలార్ ప్యానెల్స్.
ఖమ్మం : ప్రతి ఇల్లు, ప్రతి వ్యవసాయ పంపుసెట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోలార్ మోడల్ విలేజ్ (Solar Model Village) కార్యక్రమం దేశంలోనే కాదు ప్రపంచంలోనే విప్లవాత్మకమైనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ఈ పథకం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు అని అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి, రూ. 1,380 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఒక్క బోనకల్లు మండలంలోని 22 గ్రామాలకు రూ. 306 కోట్లు, రావినూతల గ్రామానికి రూ. 24 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
మహిళలు, రైతులకు ఆర్థిక భరోసా
సోలార్ విద్యుత్ ద్వారా కుటుంబాలు ఆర్థికంగా ఎలా బలపడతాయో భట్టి విక్రమార్క వివరించారు
ఆదా మరియు ఆదాయం: సోలార్ విద్యుత్ వాడకం వల్ల ఏడాదికి రూ. 14 వేల వరకు విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయి. యూనిట్‌కు రూ. 2.57: ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను (సుమారు 1086 యూనిట్లు) గ్రిడ్‌కు విక్రయిస్తే, సంవత్సరానికి రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు నేరుగా ఆదాయం లభిస్తుంది. రైతులకు సోలార్ షెడ్లు: పొలాల్లో సోలార్ ప్యానెల్స్ కోసం ఏర్పాటు చేసే షెడ్లను రైతులు విశ్రాంతి తీసుకోవడానికి లేదా పనిముట్లు దాచుకోవడానికి వాడుకోవచ్చని సూచించారు.
పర్యావరణ హితం – భవిష్యత్ ప్రణాళిక
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు సోలార్ శక్తి ఉత్తమ మార్గమని పేర్కొంటూ, రైతులు వరి వ్యర్థాలను తగులబెట్టి గాలిని కలుషితం చేయవద్దని కోరారు. సభకు ముందు, గ్రామంలోని ఒక ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్‌ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..





