Telangana Budget 2025 : తెలంగాణలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణను బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో ఈ రోజు ఉదయం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. సెర్ప్, టీజీఆర్‌ఈడీసీఓ, టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ మధ్య ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం
Solar Power Plants : వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుతో విద్యుత్ ఉత్పత్తితో పాటు మహిళలకు జీవనోపాధి సైతం లభించనుందని ప్రభుత్వం భావిస్తతోంది. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం (Indira Mahila Shakti Mission) ద్వారా లక్ష కోట్ల రూపాయాలను వడ్డీలేని రుణాలు అందించనుంది. మండల మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సులను ఆర్టీసికి అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా ఇప్పటికే 150 బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రామర్క గుర్తు చేశారు.
నారాయణపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆధ్వర్యంలో నడిపే పెట్రోల్ బంక్ కు రూ.1.23 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు ప్రభుత్వం తెలిపింది. రిటైల్, రవాణా రంగాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదని భట్టి విక్రమార్క చెప్పారు. రుణ భీమా పథకం కింద ఒక్కో స్వయం సహాయక సంఘ సభ్యురాలికి రూ.2 లక్షల సహజ మరణ బీమా, రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా అందించనున్నారు.
పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను మహిళా పొదుపు సంఘాలకు అప్పగించారు. జత యూనిఫాం కుట్టు చార్జీలను రూ.75కు పెంచారు. 37.5 లక్షల యూనిఫాంలు కుట్టడం ద్వారా రూ.28 కోట్ల ఆదాయం సంపాదించవచ్చు. ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా రూ.20 వేల కోట్ల రుణం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రూ.21,632 కోట్లను స్వయం సహాయక సంఘాలకు అందించిన విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. దీని ద్వారా 2.25 లక్షల చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేశారు. దీని ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయని, 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ప్రారంభించామని తెలిపారు.
సోలార్ పవర్ ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు
- పూర్తిగా మహిళా స్వయం సహాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ – సొంతంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు సహకారం.
- 1000 MW సోలార్ విద్యుత్ ఉత్పత్తి..
- మహిళలకు ఆర్థిక భరోసా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారం, బ్యాంక్ రుణ సదుపాయాలు
- ఉద్యోగ అవకాశాలు మహిళలకు సాంకేతిక శిక్షణ, నిర్వహణలో అవకాశాలు
- గ్రామీణ విద్యుత్ సరఫరా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను TS Transco ద్వారా గ్రామీణ విద్యుత్ అవసరాలకు వినియోగించడం.
లాభాలు
🔹 మహిళల ఆర్థిక స్థితిలో మెరుగుదల – స్వయం ఉపాధికి అవకాశాలు
🔹 పర్యావరణ పరిరక్షణ – క్లీన్ ఎనర్జీ ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గింపు
🔹 విద్యుత్ స్వయం సమృద్ధి.. గ్రామాల్లో విద్యుత్ కొరతను తగ్గించడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..