- కూరగాయల ఉత్పత్తి పెంపు దిశగా ప్రభుత్వ కీలక నిర్ణయం
- కొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు – రైతులకు ఎకరాకు రూ.9,600 సబ్సిడీ
Agriculture subsidy : రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించి స్థానిక మార్కెట్లలో సరఫరా, ధరలను స్థిరంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 10,000 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూరగాయల రైతులపై భారం తగ్గించేందుకు ఎకరాకు రూ.9,600 నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమ చేయనుంది.
ప్రస్తుతం తెలంగాణలో 1.35 లక్షల ఎకరాల్లో 14.64 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర అవసరాలు సుమారు 26 లక్షల టన్నులుగా ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ అంచనాల ప్రకారం 12.68 లక్షల టన్నుల లోటు ఉండటంతో, ఏటా 10 వేల ఎకరాల అదనపు సాగును లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యానశాఖ వివరాల ప్రకారం, ఎకరానికి విత్తనాలు, నారు, ఎరువులు, పురుగు మందులు, పోషక నిర్వహణ వంటి ఖర్చులు రూ.24,000 వరకు చేరుతాయి. అందులో 40 శాతం అయిన రూ.9,600ను సబ్సిడీగా ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది. ఒక్కో రైతు గరిష్ఠంగా 2.5 ఎకరాల వరకు ఈ సబ్సిడీ పొందవచ్చు.
Agriculture subsidy : ఏయే పంటలకు వర్తిస్తుంది?
టమాటా, వంకాయ, బెండకాయ, మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యాప్సికం, బీర, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ వంటి ప్రధాన కూరగాయ పంటలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. స్థానిక ఉద్యానశాఖ కార్యాలయాల్లో రైతులు దరఖాస్తు చేయాలి.
నర్సరీలు సిద్ధం
సిద్దిపేట–ములుగు, హైదరాబాద్–జీడిమెట్లలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నర్సరీలు ఈ ప్రాజెక్టుకు అవసరమైన నాట్లు సిద్ధం చేస్తున్నాయి. రైతులకు సరసమైన ధరకు విత్తనాలు కూడా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా కూరగాయల ఉత్పత్తి పెంచని మాత్రమే కాకుండా, మార్కెట్లలో ధరలను స్థిరంగా ఉంచడంలో, రాష్ట్రంలో ఆహార భద్రతకు, అలాగే స్థానిక సరఫరా–రవాణా కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని వ్యవసాయశాఖ భావిస్తోంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..


