
Eco Friendly Park in Hyderabad : పర్యావరణ పరిరక్షణపై అందరికీ అవగాహన కల్పించేందుకు.. ప్రకృతి ప్రేమికుల కోసం హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్ పీరియం’ పార్క్‌ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో రామ్‌దేవ్‌రావు 150 ఎకరాలలో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 వేల జాతులకు సంబంధించిన మొక్కలను ఇక్కడ చూడవచ్చు. మెక్సికో, అర్జెంటీనా, ఉరుగ్వే, దక్షిణ అమెరికా, స్పెయిన్, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల నుంచి అత్యంత అరుదైన మొక్కలు, చెట్లు, రకరకాల స్టోన్స్, అందమైన శిలలు సేకరించి అందరినీ ఆకట్టుకునేలా ఈ ఎకో పార్క్ (Eco Park) ను నిర్మించారు.
ఈ పార్కు నిర్మాణానికి సుమారు రూ. 150 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో శిల్పానికి రూ. 5 లక్షల నుంచి కోటి వరకు వెచ్చించారు. 1,500 మంది కూర్చునేలా ఇండియాలోనే అతిపెద్ద హంపీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తులో 20 స్టెయిన్ లెస్ స్టీల్ శిల్పాలు ఏర్పాటు చేసి వాటిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రూ. 50 కోట్లతో 12 ఎకరాలలో మ్యాన్‌మేడ్ బీచ్ ఏర్పాటు చేశారు. 40 గదులు, 20 కాటేజీలతో సుందరమైన సహజ రిసార్టు ద్వీపంగా తీర్చిదిద్దారు. పీవెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్, ఫొటో షూట్‌లకు ఎక్స్‌పీరియంను రామ్‌దేవ్‌రావు ఎంతో శ్రమకోర్చి ఏర్పాటు చేశారు. దేశానికి గర్వకారణంగా, రాష్ట్ర ప్రతిష్టకు చిహ్నంగా, హైదరాబాద్ (Hyderabad) కు ఐకానిక్‌గా ఎక్స్‌పీరియం ఉంటుందన్నారు.
రాష్ట్రంలో టెంపుల్, ఎకో టూరిజం
రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం (Eco Tourism) అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెంపుల్, ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. దేవాలయ దర్శనాలకు, అటవీ సంపదను చూసేందుకు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాం. రామప్ప, వేయిస్తంభాల గుడి లాంటి అద్భుతమైన ఆలయాలు తెలంగాణలో ఉన్నాయి. నల్లమల అడవులు, మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. త్వరలో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయబోతున్నాం ఎక్స్పీరియం లాంటి ఎకో టూరిజం పార్కును ఇక్కడ అభివృద్ధి చేయడం అభినందనీయం. రాబోయే రోజుల్లో ఇది అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారనుందన్నారు. వికారాబాద్ (Vikarabad) అటవీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. త్వరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నామని, రాష్ట్రం ఆలోచనకు అనుగుణంగా రామ్ దేవ్ ఈ పార్క్ ను అభివృద్ధి చేయడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని భావిస్తోందని, వనజీవి రామయ్య లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతీ విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్కను నాటించి సంరక్షించేలా కొన్ని విధానాలు తీసుకురాబోతున్నామని తెలిపారు.