
Solar cell Manufacturing Unit : తెలంగాణలో పునరుత్పాదక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్, 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుపై రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.
2500 మందికి ఉపాధి
తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ (Solar cell Manufacturing Plant) ద్వారా దాదాపు 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానికంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల సమక్షంలో అక్షత్ గ్రీన్‌టెక్ తో (మైత్రా గ్రూప్) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీ తరఫున డైరెక్టర్ గిరీష్ గెల్లి ఈ సమావేశానికి ప్రాతినిధ్యం వహించారు.
తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ
ఇది ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యం దిశగా ఈ ఒప్పందం మరో మైలు రాయిగా చెప్పవచ్చు. భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రీన్ ఫ్యూయల్ (Green Fuel) ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను ప్రథమస్థానంలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సన్ పెట్రో కెమికల్స్ (Sun Prtro chemicals) భాగస్వామ్యంతో భవిష్యత్తులో డిమాండ్‌కు అనుగుణంగా ఇంధన వనరులు సమకూరుతాయనే ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలతో పాటు మంచిర్యాల, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.