భారతదేశంలోని రోడ్లు ఆకుపచ్చగా మారుతున్నాయి. ఇది మొక్కల పెంపకం వల్ల కాదు.. రోడ్లకు రంగు వేయడం కూడా కాదు.. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles ) అమ్ముడవుతున్నాయి. ఫలితంగా పర్యావరణ సహిత, కాలుష్యరహిత రవాణా వ్యవస్థ పురోగమిస్తోంది. ఒక విధంగా ఇది గ్రీన్ మొబిలిటీ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పవచ్చు.
ది బెటర్ ఇండియా సంస్థ భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్‌లను కలిగి ఉన్న ఐదు రాష్ట్రాలతో మాప్ ను తయారు చేసింది. దేశంలో ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు విపరీతంగా పెరిగాయి.
యూపీలో 2,55,700
ఢిల్లీలో 1,25,347
కర్ణాటకలో 72,544
బీహార్‌లో 58,014
మహారాష్ట్రలో 52,506 ఈవీ రిజిస్ట్రేషన్లు జరిగాయి.
electric vehicles సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలోని చాలా EV రిజిస్ట్రేషన్లు ఈ విభాగాల నుండి వస్తున్నాయి. అనేక నగరాల్లో ఎలక్ట్రిక్ రిక్షాలు (త్రి-వీలర్లు) విస్తృతంగా ఉపయోగించడం వల్ల UP రాష్ట్రం ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
రాష్ట్ర EV పాలసీల వల్ల అందించబడిన సబ్సిడీలతో జాబితాలో ఢిల్లీ రెండవ స్థానంలో నిలిచింది. FAME II, ఇతర రాయితీల కారణంగా ఇక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
ఇక కర్నాటక రాష్ట్రం EV స్టార్టప్‌లకు కేంద్రంగా అవతరించింది. ఏథర్ ఎనర్జీ వంటి అనేక ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు బెంగళూరులో ఉన్నాయి. రాష్ట్ర EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ పెరుగుతూ వస్తున్నాయి.
పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో డెలివరీ కోసం ఈకామర్స్ సంస్థలు, ఇతర పెద్ద, చిన్న కంపెనీలు ఈవీలను ఉపయోగిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, రాష్ట్ర ఆర్టీసీలు బస్సులను నెమ్మదిగా ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేస్తే చక్కని ప్రయోజనం చేకూరుతుంది.
ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలకు మరో కారణం డెలివరీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం. అనేక ఇ-కామర్స్ బ్రాండ్‌లు ఇప్పుడు వస్తువులను తరలించడానికి ఈవీలను ఉపయోగిస్తున్నాయి. డొమినోస్ వంటి రెస్టారెంట్ చైన్‌లు కూడా లాస్ట్-మైల్ డెలివరీల కోసం ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లను ఉపయోగిస్తున్నాయి.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అతి తక్కువ సంఖ్యలో EV విక్రయాలు, రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయి. ఎందుకంటే వీటి ఖరీదు చాలా ఎక్కువ. ఇంకా ఇవి ఎగువ మధ్య తరగతి ప్రజల దరికి చేరడం లేదు. అయితే టాటా నెక్సాన్ EV వంటి కార్లు మాత్రం జనాదరణ పొందాయి.
More videos visit : Harithamithra