EV Charging Stations Telangana | తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGREDCO) రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 25-30 కిలోమీటర్లకు ఒక పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ (EVCS) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందు కోసం రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, ఇతర ఆహార దుకాణాలు, విద్యుత్ సబ్ స్టేషన్ నుండి 500 మీటర్లలోపు స్థలాలు, రహదారుల వెంబడి ప్రభుత్వ యాజమాన్యంలోని భూములు వంటి కొన్ని ప్రదేశాలను పరిశీలిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, టైర్ I, II నగరాల్లోని ఇతర ప్రదేశాలలో పబ్లిక్ EVCSలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు రెడ్కో అధికారులు తెలిపారు. నగరంలో రహదారుల వెంబడి ఉన్న ప్రదేశాలకు ఇంకా ఆమోదం లభించలేదు. స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ పార్టీల నుండి దాదాపు 1500 దరఖాస్తులు వచ్చాయి.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1,030 కంటే ఎక్కువ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో హైదరాబాద్‌లో దాదాపు 600 ఉన్నాయి. TGREDCO 2030 నాటికి పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను 6,000కి, 2035 నాటికి 12,000కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛార్జింగ్ స్టేషన్లు, వినియోగించే శక్తి సంఖ్య గత సంవత్సరం సెప్టెంబర్‌లో 2.60 మిలియన్ యూనిట్లు (MU) ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 10.15 MUకి పెరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో EV బస్ ఫ్లీట్ కోసం 7.81 MU వినియోగంతో వినియోగం భారీగా పెరిగింది. TGSRTC కు సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్లు బస్సుల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు.
EV Charging Stations : చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కావల్సినవి ఇవే..
ఎలక్ట్రిక్ వెహికిల్స్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి దాదాపు 650 చదరపు అడుగుల స్థలం అవసరం. రెండు రకాల మౌలిక సదుపాయాలు అవసరం: EV ఛార్జర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్, కేబుల్స్, AC డిస్ట్రిబ్యూషన్ బాక్స్‌లు, సివిల్ వర్క్స్, ఇతర పరికరాలు అవసరమవుతాయి. కాగా సదుపాయాలు, ఛార్జర్ సామర్థ్యాన్ని బట్టి ఖర్చు మారుతుంది. 60KW ఛార్జర్‌తో కూడిన EVCS ధర దాదాపు ₹15 లక్షలు, ఇందులో ఛార్జర్‌కు ₹7 లక్షలు, అప్‌స్ట్రీమ్‌కు మరో ₹7 లక్షలు ఉంటాయి. EVCS ఏర్పాటుకు PM E-డ్రైవ్ కింద సబ్సిడీ అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..


