
Rythu Bharosa | 22న నర్మెట్టలో ‘రైతు భరోసా’ విడుదల!
Rythu Bharosa Release Date : ప్రకృతి వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన సచివాలయంలో ప్రారంభించారు. ‘రైతునేస్తం’ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులతో నేరుగా ముచ్చటించి, వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
61,125 ఎకరాల్లో ప్రకృతి సాగు.. రూ. 42 కోట్లతో ప్రణాళిక
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ వ్యయంతో ముందుకు సాగుతోందని మంత్రి వెల్లడించారు.ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 489 క్లస్టర్లలో సుమారు 61,125 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఎంపిక చేసిన 61,125 మంది రైతులకు రైతు వేదికల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. వీరికి మార్కెటింగ్‌లో సాయపడేందుకు ఒక్కో క్లస్టర్‌కు ఇద్దరు ‘కృషిసఖిలను నియమించి, వారికి నెలకు రూ. 5000 గౌరవ వేతనం చెల్లిస్తున్నట్లు తెలిపారు.
బీజామృతం, జీవామృతం వంటి జీవ ఉత్పాదకాల తయారీ కేంద్రాల (BRC) ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 1 లక్ష చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది.
నర్మెట్టలో ‘రైతు మహోత్సవం’.. సీఎంతో నిధుల విడుదల
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా నర్మెట్టలో రైతు మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
- తేదీ: మార్చి 20 నుండి ప్రారంభం.
- స్టాల్స్: వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో 150 ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
- రైతు భరోసా (Rythu Bharosa ): మార్చి 22న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నర్మెట్ట వేదికగా మొదటి విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
సాగులో మార్పు రావాలి
కేవలం వరికే పరిమితం కాకుండా నూనె గింజలు, పప్పుదినుసులు, చిరుధాన్యాలు మరియు ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు వల్ల ప్రకృతి విపత్తుల నష్టం తక్కువగా ఉంటుందని, స్థిరమైన ఆదాయం లభిస్తుందని వివరించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 20,600 కోట్ల రుణమాఫీ చేసి రైతు పక్షపాతిగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు.
🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!
Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.
♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు



