
- సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై రూ.80,000 కోట్ల పెట్టుబడి
- పెద్ద రిజర్వాయర్లు, జలాశయాలపై తేలియాడే సౌర ప్లాంట్లు
తెలంగాణకు NTPC శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే అగ్రగామి అయిన ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా).. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో జరిగిన ఈ భేటీలో తమ భవిష్యత్ ప్రణాళికలను గురుదీప్ సింగ్ వివరించారు.
తెలంగాణ లో సౌర (Solar Power), పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై దాదాపు రూ.80,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఎన్టీపీసీ వెల్లడించింది. ముఖ్యంగా ఫ్లోటింగ్ సోలార్ (Floating Solar) (నీటి మీద తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లు) ద్వారా తెలంగాణలో సుమారు 6,700 మెగావాట్ల ఉత్పత్తి సాధ్యమని సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ తరహా ప్రాజెక్టులు రాష్ట్రానికి శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఎన్టీపీసీ(NTPC) పేర్కొంది. భూమి వినియోగం లేకుండా విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక లాభాలను ఈ తరహా ప్రాజెక్టు లు అందిస్తాయని ముఖ్యమంత్రికి ఎన్టీపీసీ ప్రతినిధులు వివరించారు.
థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడుతున్న తెలంగాణకు, ఈ పునరుత్పాదక ఇంధన పెట్టుబడులు కీలక మలుపు అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ ప్రతిపాదనకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఆయన ఎన్టీపీసీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.