హైదరాబాద్: భవిష్యత్ లో తెలంగాణలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) తెలిపారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి.. గురువారం రెండో రోజు పలు సంస్థలను సందర్శించారు. ప్రపంచంలోనూ అతి పెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్ ఫామాయిల్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్‌జీవీ కంపెనీకి చెందిన సీడ్ గార్డెన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్ధతులతో ఉన్న విత్తన కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో సీడ్ గార్డెన్ ఏర్పాటుకు ఎఫ్‌జీవీ కంపెనీ సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు. అందుకు కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఎఫ్‌జీవీ కంపెనీ కర్మాగారాన్ని సందర్శించి అక్కడ తయారు చేసే వివిధ ఉత్పత్తులను మంత్రి తుమ్మల పరిశీలించారు. కంపెనీ తీసుకునే జాగ్రత్తలు, వివిధ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ గురించి మంత్రి తుమ్మలతో పాటు అధ్యయన బృందానికి సంస్థ ప్రతినిధులు వివరించారు.
ఆయిల్‌పామ్ పరిశ్రమ అభివృద్ధికి మలేషియా సహకారం
తెలంగాణలో ఆయిల్‌పామ్ పరిశ్రమ అభివృద్ధికి మలేషియా సహకారం తీసుకోనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) తెలిపారు. ఆయిల్ పామ్ విస్తరణ అవకాశాలు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న టెక్నాలజీ, ఆయిల్‌పామ్ ఉత్పత్తిపై అధ్యయనానికి మంత్రి తుమ్మల, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషాలు మలేషియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మలేషియా ప్లాంటేషన్, కొమోడిటీస్ మంత్రి జోహరి అబ్దుల్ ఘనితో బుధవారం సమావేశమయ్యారు.
పామాయిల్ ఉత్పత్తికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామని త్వరలోనే మలేషియా బృందం తెలంగాణలో పర్యటిస్తుందని తెలిపారు. అనంతరం ఎంఏటీఆర్‌ఏవోఈ చైర్మన్ డాటో సెరి రీజల్ మెరికన్ సమావేశమయ్యారు. మలేషియాతో వ్యవసాయపరంగా వ్యాపార అవకాశాలపై మంత్రి చర్చించారు. తమ దేశంలో నూకలకు అత్యంత డిమాండ్ ఉందని డాటో చెప్పారు. వెంటనే మంత్రి తుమ్మల… హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. నూకలు ఎగుమతి చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని, తెలంగాణ వరి రైతులకు అదనపు ప్రయోజనం కలిగితే వచ్చే యాసంగి సీజన్ లోపు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం మలేషియా పామాయిల్ బోర్డును సందర్శించారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..