Harithamithra Telugu News

Home EV Updates భారత EV మార్కెట్లోకి ‘విన్‌ఫాస్ట్’ ఎంట్రీ | ఇక అసలు పోటీ మొదలైంది ..

భారత EV మార్కెట్లోకి ‘విన్‌ఫాస్ట్’ ఎంట్రీ | ఇక అసలు పోటీ మొదలైంది ..

0
vinfast ev scooter dealership
  • ఈవీ మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల విక్రయాల కోసం దేశవ్యాప్తంగా డీలర్ల ఆహ్వానం
  • దరఖాస్తుకు తుది గడువు సెప్టెంబర్ 15, 2026
  • తమిళనాడు ప్లాంట్‌లో ఏటా 10 లక్షల ఈవీల ఉత్పత్తి లక్ష్యం

హైదరాబాద్ : వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ సంస్థ ‘విన్‌ఫాస్ట్’ (VinFast), భారత ప్యాసింజర్ కార్ల విభాగంలో ప్రవేశించిన తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో మరింత పోటీపెరిగింది. రాబోయే తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు, సర్వీస్ కోసం దేశవ్యాప్తంగా పటిష్టమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఏర్పాటుకు అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.

ఆసక్తి గల ఆటోమోటివ్ పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 15, 2026 ని ఆఖరి తేదీగా నిర్ణయించింది.

తమిళనాడు ప్లాంట్ వేదికగా భారీ ప్రణాళిక:

విన్‌ఫాస్ట్ తన బహుళ-ఉత్పత్తుల విస్తరణలో భాగంగా తమిళనాడులోని తూత్తుకుడి (ట్యుటికోరిన్) సిప్‌కాట్ (SIPCOT) ఇండస్ట్రియల్ పార్క్‌లో వియత్నాం వెలుపల తన మొదటి అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అంతేకాకుండా, ఈ ప్లాంట్‌కు ఆనుకుని అదనంగా 200 హెక్టార్ల భూమి కోసం తమిళనాడు ప్రభుత్వంతో ఎంఓయూ (MoU) కుదుర్చుకుంది.

ఈ విస్తరిస్తున్న కేంద్రంలో ప్రయాణీకుల కార్లతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు, అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ టూ-వీలర్ అసెంబ్లీ లైన్లను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ నుండి ఏటా 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశాన్ని కేవలం దేశీయ మార్కెట్‌గానే కాకుండా దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు వ్యూహాత్మక ఎగుమతి కేంద్రంగా మార్చాలని విన్‌ఫాస్ట్ భావిస్తోంది.

భారత మార్కెట్లోకి రానున్న విన్‌ఫాస్ట్ EV శ్రేణి:

ఇటీవలి పేటెంట్ ఫైలింగ్స్ ఆధారంగా విన్‌ఫాస్ట్ భారత్‌లో మూడు కీలక మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది:

  1. విన్‌ఫాస్ట్ ఇవో (Evo): రోజువారీ ప్రయాణికుల కోసం 2.4 kWh బ్యాటరీ ప్యాక్, 12-అంగుళాల చక్రాలతో రూపుదిద్దుకున్న ఎంట్రీ-లెవల్ స్కూటర్.
  2. విన్‌ఫాస్ట్ ఫెలిజ్ (Feliz): పెద్ద 14-అంగుళాల చక్రాలు, 3 kWh బ్యాటరీ సెటప్‌తో ఎక్కువ దూరం ప్రయాణించే వినియోగదారుల కోసం రూపొందించిన మోడల్.
  3. విన్‌ఫాస్ట్ వైపర్ (Viper): ఇటీవల భారత్‌లో పేటెంట్ పొందిన ఈ మోడల్ స్పోర్టీ & ప్రీమియం లుక్‌తో రానుంది. డ్యూయల్ 1.5 kWh (మొత్తం 3 kWh) ఫ్లెక్సిబుల్ బ్యాటరీ కాన్ఫిగరేషన్‌తో అధిక వేగం, ఎక్కువ రేంజ్ ఇస్తుంది.

పోటీ ప్రపంచంలో ‘3S’ ఫార్ములా:

ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగం నెలకు లక్ష యూనిట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ (iQube), బజాజ్ (Chetak), అథర్ ఎనర్జీ (Rizta), హీరో విడా వంటి దిగ్గజాలు ఇప్పటికే మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

ఈ గట్టి పోటీని తట్టుకోవడానికి విన్‌ఫాస్ట్ సేల్స్ ప్రారంభానికి ముందే సాంప్రదాయ ‘3S’ ఫార్మాట్ (సేల్స్, సర్వీస్, స్పేర్స్) డీలర్‌షిప్‌లపై దృష్టి సారించింది. షోరూమ్‌లు, టెస్ట్ రైడ్‌లు, స్పేర్ పార్ట్స్ లభ్యత, అమ్మకాల తర్వాత మెరుగైన సర్వీస్ అందించడం ద్వారా భారతీయ కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవచ్చని భావిస్తోంది. సెప్టెంబర్ 15న డీలర్ల దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం, టైర్-1, టైర్-2 నగరాల జాబితాతో పాటు భారతీయ మోడళ్ల అధికారిక విడుదల వివరాలు, ధరల కాలపట్టికను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.

Previous articleఈ రెండు ఫ్యామిలీ ఈవీ స్కూటర్లలో ఏది బెటర్? – Ather konarc vs Simple wave
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here