ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి భట్టి విక్రమార్క ‘మెగా రైతు మేళా’ (Mega Raitu Mela)ను వైభవంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రైతుల ఆర్థిక ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి నిర్ణయం తీసుకుంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. సాగునీరు, వ్యవసాయ యాంత్రీకరణ (Farm Mechanization), ధాన్యం కొనుగోళ్లు, మార్క్‌ఫెడ్ కార్యకలాపాల కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని చెప్పారు. మార్కెట్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. ప్రభుత్వం ముందుకొచ్చి ధాన్యం, మొక్కజొన్న, జొన్నలను పూర్తిగా కొనుగోలు చేసిందని గుర్తుచేశారు.
కేవలం 9 రోజుల్లోనే రూ.9,000 కోట్లు!
రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని ప్రకటించారు. సత్తుపల్లి నుంచి ఆదిలాబాద్ వరకు పామాయిల్ ప్లాంటేషన్‌ను విరివిగా ప్రోత్సహిస్తున్నామని, ఇందుకోసం ఫార్మ్ మెకనైజేషన్ వైపు పెద్దపీట వేస్తున్నామని వివరించారు.
3 లక్షల మందితో ‘రైతు ఆశీర్వాద సభ’:
మధిర నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ‘రైతు ఆశీర్వాద సభ’కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులంతా హాజరవుతున్నారని తెలిపారు. దాదాపు 3 లక్షల మందికి పైగా రైతులు ఈ సభకు తరలిరానున్నారని, ఏ బూత్ నుంచి ఎంతమంది వస్తున్నారో కూడా తమ వద్ద ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయని చెప్పారు.




