- మహిళలు, చిన్నారులతో కలసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన పవన్ కళ్యాణ్
- డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను వీక్షించిన ఉప ముఖ్యమంత్రి
విజయవాడ/ఎన్టీఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచి, పర్యావరణాన్ని కాపాడే దిశగా కూటమి ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమానికి నాంది పలికింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan ) ఎన్టీఆర్ జిల్లా, మూలపాడులోని బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారీ ప్రక్రియకు ఆయన అధికారికంగా శ్రీకారం చుట్టారు.
ఈ వినూత్న కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు, పాఠశాల విద్యార్థులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి డిప్యూటీ సీఎం స్వయంగా విత్తన బంతులను తయారు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రాంతాల్లో సీడ్ బాల్స్ తయారీ
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో విస్తృతంగా సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూలపాడు బటర్ ఫ్లై పార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ వీక్షించారు. సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న ప్రజలతో ముచ్చటించారు. ఏఏ విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు? ఎంత మొత్తంలో రూపొందిస్తున్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వన సంరక్షణకు పని చేస్తున్న మహనీయుల స్ఫూర్తితో విత్తన బంతుల తయారీ ప్రక్రియను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. సీడ్ బాల్స్ ఆవశ్యకతను వివరించిన చిన్నారులను అభినందించారు. జూన్ 15వ తేదీ నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ రూపొందించాలని అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. అనంతరం డ్రోన్ల సహాయంతో కొండ శిఖరాలపై విత్తన బంతులు జారవిడిచే ప్రక్రియను పరిశీలించారు.
ప్రతి ఎకో పార్కులో ఒక యోగా హాల్
అంతకు ముందు మూలపాడు బటర్ ఫ్లై పార్కులో అటవీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. బటర్ ఫ్లై పార్కు నమూనా పరిశీలనలో అక్కడ యోగా హాల్ నిర్మాణం ఆయనను ఆకట్టుకుంది. ప్రతి ఎకో టూరిజం పార్కులో ఒక యోగా హాల్ నిర్మించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కొయ్య బొమ్మలు, కళాకృతుల ప్రచారానికి హామీ
అనంతరం కొండపల్లి కొయ్య బొమ్మలు తయారీకి వినియోగించే తెల్ల పొణికి దుంగలను పరిశీలించారు. పక్కనే ఏర్పాటు చేసిన కొండపల్లి కొయ్య బొమ్మలు, ఉదయగిరి కళాకారులు నిర్ధ, బిళ్ల నిర్ధ, వేప కర్రతో తయారు చేసిన గ్లాసులు, గరిటలు వంటి వంట ఇంటి సామాగ్రిని ఆసక్తిగా తిలకించారు. కళాకారులు రూపొందించిన చెక్క వాచ్, ల్యాప్ టాప్ పవన్ కళ్యాణ్ ని ఆకట్టుకున్నాయి. చిత్తూరు నుంచి వచ్చిన కళాకారులు బొమ్మల తయారీకి అవసరం అయిన చెక్క లభించడం లేదని తెలుపగా, వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల కళాకారుల చేత ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రతిమను తయారు చేయించాలని కోరారు. అద్భుతమైన కళారూపాలకు మార్కెటింగ్ కల్పించేందుకు, ప్రచారం ద్వారా ప్రాచుర్యం కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి రెండు నెలలకి ఓ ప్రాంతంలో చేతి వృత్తుల కళాకారులను కలిసే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణప్రసాద్, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు, అటవీశాఖ సలహాదారుడు మల్లికార్జునరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, మైలవరం ఇంఛార్జ్ అక్కల రామ్మోహన రావు తదితరులు పాల్గొన్నారు.




