- వుడ్ బ్యాంక్ ఏర్పాటుతో పంచాయతీలకు భారీ ఆదాయం.. అటవీ, పంచాయతీరాజ్ శాఖల మధ్య ప్రత్యేక ఎంఓయూ (MoU).
- రాజనగరం ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం.. 400 జాతుల మొక్కలను చూసి హర్షం.
- మొక్కల పెంపకం కేవలం బాధ్యత కాదు.. భావి తరాలకు నేర్పించాల్సిన సంస్కృతి: పవన్ కళ్యాణ్.
రాజమహేంద్రవరం: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక అడుగు వేయబోతోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశీయ (దేశవాళి) వృక్ష జాతి మొక్కలతో ప్రత్యేక వనాలను అభివృద్ధి చేయాలని, దీనికోసం అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా ‘వనయజ్ఞం’ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం రాజనగరంలోని ప్రాంతీయ అటవీ అభివృద్ధి కేంద్రాన్ని (Regional Forest Research Centre) డిప్యూటీ సీఎం సందర్శించారు. అక్కడ పెరుగుతున్న వృక్ష సంపద, నర్సరీ నిర్వహణను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
2 లక్షల మొక్కలు.. 400 విభిన్న జాతులు: డిప్యూటీ సీఎం ఆశ్చర్యం!
రాజనగరం అటవీ పరిశోధన కేంద్రంలో సుమారూ 400 రకాల విభిన్న దేశీయ జాతులకు చెందిన రెండు లక్షలకు పైగా మొక్కలు సిద్ధంగా ఉన్నాయని తెలుసుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న విశిష్టమైన మొక్కల వివరాలను, వాటి ప్రత్యేకతలను అటవీ అధికారులు ఆయనకు క్షుణ్ణంగా వివరించారు.
ఈ అద్భుత వృక్ష సంపదను కేవలం పరిశోధనలకే పరిమితం చేయకుండా, తక్షణమే సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారిని పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు ఆదేశించారు. అటవీ అధికారులతో వెంటనే ఎంఓయూ కుదుర్చుకుని, ఈ విలక్షణమైన మొక్కలను ప్రతి పంచాయతీకి చేరవేసి నాటించేలా పనులు ప్రారంభించాలని సూచించారు.
పంచాయతీలకు సరికొత్త ‘ఆదాయ మార్గం’
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, దేశీయ మొక్కలను నాటడం వల్ల కేవలం పండ్లు, ఫలాలు మాత్రమే కాకుండా మన సంస్కృతి, నాగరికత పరిఢవిల్లుతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కలప కొరత ఎక్కువుగా ఉందని, దీనిని మన గ్రామ పంచాయతీలు ఒక అద్భుత ఆర్థిక అవకాశంగా మార్చుకోవచ్చని సూచించారు.
“తక్కువ సమయంలోనే నాణ్యమైన కలపను ఇచ్చే వాణిజ్య మొక్కలు చాలా ఉన్నాయి. వీటిని పంచాయతీ వనాల్లో పెంచి, బహిరంగ మార్కెట్ ద్వారా విక్రయించడం వల్ల గ్రామ పంచాయతీలకు సొంతంగా బలమైన ఆర్థిక వనరులు సమకూరుతాయి. పల్లెలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తాయి.” – శ్రీ పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి
భావి తరాలకు పర్యావరణ పాఠాలు
మొక్కలను నాటడం ఎంత ముఖ్యమో, వాటిని రక్షించడం కూడా అంతే ముఖ్యమని, ఈ బాధ్యతను గ్రామీణ ప్రజలు స్వచ్ఛందంగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా, గ్రామాల్లో దేశీయ మొక్కలను నాటడం, వాటిని ప్రాణప్రదంగా సంరక్షించడాన్ని పిల్లలకు ఒక బాధ్యతగా, చిన్నతనం నుంచే అలవాటు చేయాలని.. ఇది రాబోయే తరాల మనుగడకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం వెంట అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతి లాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి మరియు ఉన్నత స్థాయి అటవీ అధికారులు పాల్గొన్నారు.




