Harithamithra Telugu News

Home Agricultue సేంద్రియ వ్యవసాయం Urea Shortage | మళ్లీ యూరియా కష్టాలు.. చలిలో అన్నదాతల పడిగాపులు!

Urea Shortage | మళ్లీ యూరియా కష్టాలు.. చలిలో అన్నదాతల పడిగాపులు!

0
Urea Shortage

Urea Shortage in Telangana | రాష్ట్రంలో ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. యాసంగి సాగు పనులు ఊపందుకుంటున్ననేపథ్యంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా రైతులు ఎరువుల దుకాణాల వద్ద గంటల కొద్దీ తరబడి క్యూలో పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు, కర్రలు క్యూలో పెట్టిన దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’.. రైతులకు వరమా? శాపమా?

ఎరువుల పంపిణీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ రైతులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. గతంలో నేరుగా గోదాములకు వెళ్లి డబ్బులు చెల్లించి ఎరువులు తెచ్చుకునే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సామాన్య రైతులు అయోమయానికి గురవుతున్నారు.

సాంకేతిక సమస్యలు: యాప్ ప్రారంభించిన తొలిరోజునే మొరాయించడం రైతుల్లో ఆందోళన కలిగించింది.

అవగాహన లేమి: గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతుల వద్ద ఇప్పటికీ సాధారణ కీప్యాడ్ ఫోన్లే ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నవారికి కూడా ఓటీపీలు చెప్పడం, యాప్‌లో షాపుల పేర్లు ఎంచుకోవడం కత్తిమీద సాములా మారింది.

యాప్‌లో ఒక షాపు పేరు బుక్ చేస్తే, అక్కడికే వెళ్లి ఐటీ నంబర్ చెప్పి ఎరువులు తీసుకోవాలి. 15 రోజులు దాటితే ఆ బుకింగ్ రద్దవుతుంది. ఈ ప్రక్రియపై రైతులకు కనీస అవగాహన లేకపోవడం గమనార్హం.

ఏఈవోలపై అదనపు భారం

యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించే బాధ్యతను ప్రభుత్వం వ్యవసాయ విస్తీర్ణాధికారులకు (AEO) అప్పగించింది. ఇప్పటికే విధులతో సతమతమవుతున్న ఏఈవోలకు ఇది అదనపు టాస్క్ కావడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామాల్లోని రైతులకు ఈ సమాచారం సరిగ్గా చేరడం లేదు.

పాత పద్ధతే ముద్దు అంటున్న రైతులు

Urea Shortage : “మాకు ఫోన్లు, యాప్‌ల గురించి ఏమీ తెలియదు. పాత పద్ధతిలోనే ఎరువులు ఇస్తే బాగుంటుంది” అని రైతులు వేడుకుంటున్నారు. చలిలో క్యూలో నిలబడలేక, యాప్‌లో బుకింగ్ చేసుకోలేక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు మండిపడుతున్నారు.

కామారెడ్డి జిల్లాలో సుమారు 4.44 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, దాదాపు 40 వేల మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. ప్రభుత్వం స్పందించి ఎరువుల పంపిణీని సరళతరం చేయకపోతే యాసంగి సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.


Previous articleTVS Orbiter vs TVS iQube : టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఐక్యూబ్‌కు దీనికి తేడా ఏంటి?
Next articleElectric Vehicles : పర్యావరణ ప్రేమికులకు పండగే: 2026లో భారత్‌లో విడుదల కానున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Kavya P
కావ్య‌. హ‌రిత‌మిత్ర‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. జ‌ర్న‌లిజంలో 16 ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ఈమె వ్య‌వ‌సాయ రంగం, జీవ‌న‌శైలికి సంబంధించిన వార్త‌ల‌ను అందిస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here