- సొంతంగా కరెంట్ ఉత్పత్తి చేసుకునే అత్యాధునిక సాంకేతికత.. జింద్-సోనిపత్ మధ్య తొలి ప్రయాణం!
- కర్బన ఉద్గారాలకు చెక్.. గంటకు 75 కి.మీ వేగం, బహుళ అంచెల భద్రతతో హైడ్రోజన్ రైలు విశేషాలు!
న్యూఢిల్లీ/హరియాణా: భారత రైల్వే రంగాన్ని పర్యావరణహితంగా మార్చే దిశగా ఒక చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు (Hydrogen Train) శుక్రవారం పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక పర్యావరణహిత రైలును జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.
Hydrogen Train : తొలి రూట్, సామర్థ్యం
- ప్రయాణ దూరం: ఈ హైడ్రోజన్ రైలు తొలి దశలో ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపత్ సెక్షన్‌లో 89 కిలోమీటర్ల మేర నడుస్తుంది.
- స్టేషన్లు: ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లలో రైలు ఆగుతుంది.
- కోచ్‌లు & ప్రయాణికులు: 10 కోచ్‌లతో రూపొందించిన ఈ రైలులో ఒకేసారి 2,600 మంది ప్రయాణించే వీలుంది.
- భవిష్యత్తు ప్రణాళిక: త్వరలోనే కల్కా-శిమ్లా వంటి ప్రసిద్ధ సాంస్కృతిక వారసత్వ (Heritage) రైల్వే లైన్లలో కూడా ఈ హైడ్రోజన్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు.
ప్రపంచ దేశాల సరసన భారత్:
ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా జర్మనీ ఈ సాంకేతికతను ప్రవేశపెట్టగా.. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ వంటి దేశాలు ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగా లేదా పరిమితంగా వినియోగిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ అగ్రదేశాల సరసన చేరింది.
పనిచేసే విధానం.. ప్రత్యేకతలివే!
సాధారణ విద్యుత్ రైళ్లు పైన ఉండే కరెంట్ తీగల (Overhead Lines) ఆధారంగా, డీజిల్ రైళ్లు ఇంధనాన్ని మండించి నడుస్తాయి. కానీ హైడ్రోజన్ రైలు వీటికి భిన్నంగా తన కరెంట్‌ను తనే సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది.
ఫ్యూయెల్ సెల్ టెక్నాలజీ: ఈ రైలులో ‘ప్రొటాన్ ఎక్స్‌ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయెల్ సెల్’ అనే చిన్నపాటి పవర్‌ప్లాంట్ ఉంటుంది. ఇందులో 1,200 కిలోవాట్ల సామర్థ్యంతో హైడ్రోజన్, ఆక్సిజన్ల మధ్య రసాయన చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తవుతుంది.
శక్తిమంతమైన ఇంజిన్: ఇలా తయారైన విద్యుత్ ట్రాక్షన్ మోటార్లకు శక్తిని అందించి చక్రాలను నడుపుతుంది. దీని ప్రొపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3,200 హెచ్‌పీ (HP). ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
పూర్తి పర్యావరణహితం: ఇందులో ఎలాంటి దహనచర్య జరగదు. కాబట్టి హానికారక పొగ, కర్బన ఉద్గారాలు వెలువడవు. కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వస్తాయి. అంతేకాకుండా ఈ రైలు చేసే ధ్వని కూడా చాలా తక్కువ.
హై-టెక్ భద్రతా ప్రమాణాలు
- హైడ్రోజన్ ఇంధనం కావడంతో భద్రతకు రైల్వే శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది:
- ఆటోమేటిక్ షట్‌ఆఫ్: నాన్‌స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థ వల్ల లీకేజీలు ఉన్నా గాల్లో కలిసిపోతాయి. ప్రమాదాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్ షట్‌ఆఫ్ వ్యవస్థ హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది.
- మల్టీ-లేయర్ సెక్యూరిటీ: హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగ వంటి ముప్పులను సెకన్లలోనే గుర్తించి అలర్ట్ చేసే బహుళ అంచెల భద్రతా వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.
- ప్రత్యేక లోకో పైలట్ క్యాబిన్: లోకోపైలట్ భద్రత కోసం క్యాబిన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పైలట్ ముందుండే స్క్రీన్ కారులోని అన్ని అంశాలను ఎప్పటికప్పుడు లైవ్‌లో ప్రదర్శిస్తుంది.




