Harithamithra Telugu News

Home Agricultue ఉద్యాన పంటలు ఖమ్మంలో రూ.300 కోట్లతో ‘గోద్రెజ్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ

ఖమ్మంలో రూ.300 కోట్లతో ‘గోద్రెజ్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ

0
పామ్ ఆయిల్ సాగు
  • పామ్ ఆయిల్ సాగు రైతులకు వరం.. ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.45 వేల వరకు సబ్సిడీ: భట్టి విక్రమార్క!
  • తెలంగాణను దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. 10 లక్షల ఎకరాలే లక్ష్యం: మంత్రి తుమ్మల!

ఖమ్మం జిల్లా రైతాంగానికి అధిక దిగుబడి, మెరుగైన రాబడి అందించేందుకు పామ్ ఆయిల్ సాగు ఒక అద్భుతమైన వరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘గోద్రెజ్ ఇంటిగ్రేటెడ్ పామ్ ఆయిల్ పరిశ్రమ’ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రెజ్ యాజమాన్య ప్రతినిధులతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు.

113 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్‌లో సీడ్ జెనెటిక్స్, సీడ్ గార్డెన్, నాణ్యమైన నర్సరీ, ఆర్ అండ్ డి (R&D) కేంద్రంతో పాటు మిల్లింగ్ అండ్ రిఫైనింగ్ యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి.

రైతులకు ఎకరాకు రూ.45 వేల సబ్సిడీ: డిప్యూటీ సీఎం భట్టి

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం జిల్లా జిల్లాల పునర్విభజన తర్వాత కేవలం వ్యవసాయానికే పరిమితమైందని, ఎల్ నినో లేదా వర్షాభావ పరిస్థితులు ఎదురైనా పామ్ ఆయిల్ సాగు వల్ల రైతులకు ఎలాంటి నష్టం రాదని తెలిపారు.

  • ప్రభుత్స ప్రోత్సాహం: పామ్ ఆయిల్ సాగును విస్తరించేందుకు ప్రభుత్వం రైతులకు ఎకరాకి రూ.4,000 నుంచి రూ.45,000 వరకు భారీ సబ్సిడీ అందిస్తోందని వెల్లడించారు.
  • విదేశీ మారక ద్రవ్యం ఆదా: దేశంలో ఏటా 25 లక్షల మిలియన్ టన్నుల పామ్ ఆయిల్ అవసరం ఉండగా, ప్రస్తుతం 12 లక్షల మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందని తెలిపారు. మిగిలిన లోటును దిగుమతి చేసుకోవడం వల్ల రూ.1.5 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం వేరే దేశాలకు చెల్లించాల్సి వస్తోందని, ఇక్కడే ఉత్పత్తి పెంచితే దేశ ఆర్థిక వ్యవస్థకు, రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుందన్నారు.
  • 1991లోనే పునాది: ఉమ్మడి ఏపీలో 1991-92 ప్రాంతంలో నాటి సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుకు సర్వే చేయించి బీజం వేశారని గుర్తుచేశారు.

సీడ్ ఇంపోర్ట్ నుంచి ఎక్స్‌పోర్ట్ దిశగా: మలేషియా, ఇండోనేషియా నుంచి విత్తనాలు దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి.. మన దేశ అవసరాలకు ఇక్కడి నుంచే నాణ్యమైన విత్తనం అందించే స్థాయికి ఎదగాలని భట్టి ఆకాంక్షించారు. రైతు కేవలం పంట పండించడమే కాకుండా విలువ ఆధారిత (Value Added) ఉత్పత్తులు తయారు చేసినప్పుడే ‘రైతే రాజు’ అనే కల నెరవేరుతుందన్నారు.

రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు సాగు పెంపు: మంత్రి తుమ్మల

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలుగా గోద్రెజ్ సంస్థ రైతుల వద్ద నుంచి గెలల కొనుగోలులో భాగస్వామిగా ఉందన్నారు.

  • నాలుగో ఫ్యాక్టరీ: తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయిల్ పామ్ సాగు 3 లక్షల ఎకరాలకు విస్తరించిందని, తెలంగాణలో ఉన్న మూడు ఫ్యాక్టరీలకు తోడు గోద్రెజ్ ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ నాలుగోదని చెప్పారు.
  • లక్ష్యం 10 లక్షల ఎకరాలు: రానున్న 2 నుంచి 3 ఏళ్లలో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
  • దేశంలోనే తొలి సీడ్ గార్డెన్: మలేషియా భాగస్వామ్యంతో దేశంలోనే తొలి ఆధునిక సీడ్ గార్డెన్‌ను గోద్రెజ్ ఖమ్మంలో ఏర్పాటు చేస్తోందని, దీంతో పాటు పరిశోధనా కేంద్రం, శిక్షణా కార్యక్రమాలను నేటి నుంచే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
Previous articleHydrogen Train | భారత రైల్వేలో నూతన శకం: దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here