Oil Palm Factory | తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏడాది లోపే రూ. 300 కోట్లతో జిల్లాలో పామ్ ఆయిల్ పరిశ్రమ (Oil Palm Factory) ను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పామ్ ఆయిల్ ఉత్పత్తిలో సిద్దిపేట జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.
గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తర దేశాల నుంచి లక్ష కోట్లు పెట్టి పామ్‌ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఇంకా 11 వేల ఎకరాలకు పెంచాలి. భారత దేశానికి కావలసిన పామ్ ఆయిల్ మొత్తం తెలంగాణ రాష్ట్రమే ఇస్తుందని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి చెప్పారని మంత్రి తుమ్మల గుర్తుచేశారు. కాగా ప్రతి గింజను మార్కెట్ ధర కంటే ఎక్కువకు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటుందని తెలిపారు. త్వరలోనే రూ. 2 లక్షల రుణ మాఫీనీ పూర్తిచేస్తామని మరోసారి భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు త్వరలో అందుబాటులోకి వొస్తాయి. రైతులు కేవలం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..