
Solar Power Project : రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించే దిశగా అస్సాం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈమేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Assam Chief Minister Himanta Biswa Sarma) దిబ్రూగఢ్ జిల్లాలోని నామ్‌రూప్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణంలో 25-మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అస్సాం పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్ గా, ఈ ప్రాజెక్ట్ 108 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీని వ్యయం రూ. 115 కోట్లు.
ఆగస్టు 19, 2022న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఈ ప్రాజెక్ట్ ఏటా 50 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేశారు. దీని నిర్మాణం జూలై 2025 నాటికి పూర్తవుతుంది. నామ్‌రూప్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ 2021లో తాను పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు, రాష్ట్రంలో పీక్-అవర్ విద్యుత్ డిమాండ్ 1,800 మెగావాట్లుగా ఉందని, కానీ కొన్నేళ్లుగా రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, గతంలో విద్యుత్తు లేని గ్రామాల విద్యుదీకరణ కారణంగా ఈ డిమాండ్ 2,500 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు.
“రాష్ట్రం కేవలం 419 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది, ప్రతిరోజూ దాదాపు 2,100 మెగావాట్ల కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. నామ్‌రూప్ వద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాలు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయని, రాష్ట్రం వెలుపల నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, ”అని అస్సాం ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రంలో ఏడు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు
Solar Power Project : రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడు సౌరవిద్యుత్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయని, రోజువారీగా 175 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ముఖ్యమంత్రి హైలైట్ చేశారు. సోనిత్‌పూర్ జిల్లాలోని బర్చల్లా, ధుబ్రీ జిల్లాలోని ఖుదీగావ్‌లో రాబోయే పవర్ ప్లాంట్లు నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నాయని, కర్బీ అంగ్లాంగ్‌లో 1,000-మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. అదనంగా, 120-MW లోయర్ కపిలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. 2030 నాటికి రాష్ట్రంలో దాదాపు 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతామని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించిన సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (Surya Ghar Muft Bijli Yojana ) గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలు తమ విద్యుత్ వినియోగ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో అస్సాం కేబినెట్ మంత్రులు బిమల్ బోరా, సంజోయ్ కిషన్, మాజీ కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి, అస్సాం శాసనసభ సభ్యులు ప్రశాంత ఫుకాన్, తరంగ గొగోయ్, తెరష్ గోవల్లా, బినోద్ హజారికా, చక్రధర్ గొగోయ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..