Free Solar Power | సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి కూడా కీలక ప్రకటన చేశారు. 22 గ్రామాలకు ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా సోలార్ విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. ఫైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిపోతోంది.ఈ క్రమంలో విద్యుత్ కొరత తలెత్తకుండా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా సోలార్ పంప్‌సెట్లు అందజేయాలని కూడా సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉచితంగా సోలార్ పంపుసెట్లు, ఇళ్లకు సోలార్ కరెంటు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా తొలి విడతలో 22 గ్రామాలను ఎంపిక చేసుకుని రైతుల పొలాల్లో వ్యవసాయ పంపు సెట్లు, గ్రామాల్లోని ఇళ్లకు పూర్తిగా సోలార్ విద్యుత్ అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఖర్చుతోనే ఈ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో రెడ్కో, ఎస్పీడీసీఎల్ అధికారులతో గత శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్నదాతలకు పంటల ద్వారానే కాకుండా అదనంగా సోలార్ పవర్ నుంచి కూడా కొంత ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి, తన సొంత నియోజకవర్గం మధిరలోని సిరిపురంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 గ్రామాలను ఎంపిక చేయాలని చెప్పారు. ఈ గ్రామాల్లో పూర్తి ఉచితంగా వ్యవసాయ పంపు సెట్లు, గృహాలకు సోలార్ విద్యుత్ అందించాలని సూచించారు.
Free Solar Power in Telangana మరోవైపు స్వయం సహాయక సంఘాలకు 5 నుంచి 10 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఆర్థికంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. దీనివల్ల తెలంగాణలో విద్యుత్ కొరతరాకుండా ఉంటుందని తెలిపారు. ఇక ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేసేందుకు సోలార్ పవర్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వంటగ్యాస్ బదులుగా తర్వలోనే సోలార్ విద్యుత్ వినియోగ విధానం తీసుకురావాలని భావిస్తోంది.అందుకు మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..