EV Subsidy | ఎలక్ట్రిక వాహనాలపై సబ్సిడీపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఈవీల స్వీకరణ గణనీయంగ పెరిగిందని ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. వినియోగదారులు పెట్రోల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలను సొంతంగానే మారుతున్నారని చెప్పారు. గురువారం జరిగిన బీఎన్‌ఈఎఫ్ సమ్మిట్‌లో నితిన్ గడ్కరీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండేదని, క్రమంగా ఈవీలకు భారీగా డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి వ్యయం తగ్గిందని తెలిపారు. దీంతో సబ్సిడీ అవసరం లేదని తెలిపారు. వాహనదారులు ప్రస్తుతం ఎలక్ట్రిక్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వాహనాలను సైతం ఎంచుకుంటున్నారని, ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్‌జీ వాహనాలకు మరింత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఈవీ వాహనాలపై జీఎస్టీ తక్కువగా ఉందని చెప్పారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. తన దృష్టిలో ఈవీ వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అని కేంద్రమంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం హైబ్రిడ్‌తో సహా పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే వాహనాలపై 28 శాతం జీఎస్‌టీ ఉందని, కానీ ఎలక్ట్రిక్ వాహనాలపై కేవలం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇటీవల కేంద్ర పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒకటి, రెండు నెలల్లో ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అడాప్షన్ స్కీమ్ (FAME) 3వ దశను ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ఫేమ్ 3 పథకానికి సంబంధించిన ఇన్‌పుట్‌లపై విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) పథకం మొదటి, రెండు దశల్లోని సమస్యలను పరిష్కరించేందుకు యత్నిస్తున్నామని, అన్ని వర్గాల నుంచి సూచనలు చేస్తున్నామని తెలిపారు. ఫేమ్-3 ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన అమలవుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) 2024ని భర్తీ చేయనుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..