Solar Panels For Home | మీరు కొత్తగా ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా సోలార్ పానల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌అధికారులు కొత్తగా ఈ నిబంధనలు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇకపై ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్‌ప్యానెల్స్ (Rooftop Solar Power) ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకొని విధివిధానాలను రూపొందించనున్నారు. రాష్ట్రంలో సౌరవిద్యత్ తయారీని ప్రోత్సహించేందుకు గాను ఈ తాజా నిర్ణయం దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రతీ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్థానిక అవసరాలకు విద్యుత్ ను ఉత్పత్తి అవుతుంది. తద్వారా దీనివల్ల నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్ తీర్చవచ్చు.
Solar Panels For Home : కాలుష్యరహితమైన పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యసాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరోవైపు గ్రామాల్లోనూ సోలార్ ఎనర్జీ హబ్‌లుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతీ గ్రామంలోనూ నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి సబ్‌స్టేషన్లకు విద్యుత్ ను సరఫరా చేయాలని అనుకుంటున్నారు. దీని వల్ల ఎక్కడికక్కడ సోలర్ కరెంట్ ను ఉత్పత్తి చేసి సమీప గ్రామాల్లో విద్యుత్ కోతల నుంచి ఉపశమనం కలిగించవచ్చు. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి విధివిధానాలను రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల తర్వాత ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితోనూ చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విద్యుత్ సమస్యకు స్థిరమైన శాశ్వత పరిష్కారం కావాలంటే.. సోలార్ విద్యుతే చక్కని ప్రత్యామ్నాయమని తేల్చారు. ప్రస్తుతం థర్మల్, హైడ్రల్, సౌర, పవన విద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. హైడల్ పవర్ అందుబాటులో లేని సమయంలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు బయట నుంచి ఎక్కువ మొత్తానికి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సౌర విద్యుతే అన్నింటికన్నా బెటరని ప్రభుత్వం గుర్తించింది.
ఫ్లోటింగ్ సోలార్ సిస్టమ్..
జలాశయాలపై సోలార్ ప్యానల్స్ (Solar Panels ) ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని ఇపుడు అనేక రాష్ట్రాలు అవలంబిస్తున్నాయి. రామగుండంలో గోదావరి నదిలో ఇలాగే నీటిపై తేలియాడే సోలార్ (floating solar panels) ప్రాజెక్టును చేపట్టారు. తాజాగా తెలంగాణలోని నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లోనూ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో తేలియాడే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పాదనతోపాటు, నీరు ఆవిరి కావడాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. రిజర్వాయర్ల నుంచి నీరు వెళ్లే కాలువ గట్లపై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రామగుండం ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో ఇప్పటికే సింగరేణి సంస్థ భారీస్థాయిలో ఫ్లోటింగ్ సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో కూడా బొగ్గు తవ్విన తర్వాత ఆ ప్రాంతాలనూ ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ పరిశ్రమల్లో బొగ్గు వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. తద్వారా కాలుష్యం పెరిగిపోతోంది. విద్యత్ ప్లాంట్ల నిర్వహణ, బొగ్గు ధరలు ఏటా పెరుగుతుండడంతో విద్యుత్ ధర కూడా పెరుగుతూ వస్తోంది. ఇది ప్రభుత్వంపైనే కాకుండా ప్రజలపై కూడా భారంగా పడుతోంది. దీనిని నివారించేందుకు సోలార్ విద్యుత్ తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..