Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Green Mobility | ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు

Spread the love

Green Mobility | హైదరాబాద్‌ను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) వెల్లడించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఓఆర్‌ఆర్‌ (ORR) పరిధిలో కొత్తగా 3000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు.

నగరంలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి తొలిసారి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు (AMVI) నియామక పత్రాలను అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గడిచిన పది నెలల్లో ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను వివరించారు.

మూసీ పునరుజ్జీవం అందరి బాధ్యత

నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ (Musi) పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకురానున్నాం. రవాణా శాఖలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి సేవలు అందించడంలో ప్రజలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి. తెలంగాణలో గడిచిన పదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక్కో చిక్కుముడి విప్పుతూ పది నెలల్లో 50 వేల వరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.

గంజాయి, డ్రగ్స్ దూరంగా ఉండాలి..

ఇప్పుడు ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులు గ్రామాల్లో విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రోత్సహించాలి. గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలోకి రాకుండా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. గృహ ప్రవేశాల్లాంటి శుభ సందర్భాల్లో మత్తు పదార్థాలు తీసుకుని బుకాయించే సంస్కృతి రానీయొద్దు. 10 నెలల్లో 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేశాం. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల 1.05 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందారు. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకుంటున్న 49.90 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాం. ఆడబిడ్డలకు రూ. 500 కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 పోస్టులకు గ్రూప్ I పరీక్షలు నిర్వహించాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఇలాంటివెన్నో చేశామని ముఖ్యమంత్రి వివరించారు.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *